న్యూఢిల్లీ, నవంబర్ 5: కేంద్ర దర్యాప్తు సంస్థలు బీజేపీకి తొత్తులా వ్యవహరిస్తున్నాయన్న విపక్షాల ఆరోపణలు నిరూపించే దృశ్యం ఇది. జార్ఖండ్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఇండ్లలో సోదాలు చేపట్టిన ఐటీ అధికారులు.. బీజేపీకి సంబంధించిన వాహనాలు వాడారు. ఓ వాహనానికి బీజేపీ స్టిక్కర్ ఉన్న ఫొటో, వీడియో నెట్టింట్లో వైరల్ అయ్యింది. అంతేకాదు.. ఓ వ్యక్తి ఆ స్టిక్కర్‌ను తొలగిస్తున్నట్టు కూడా వీడియోలో ఉన్నది. దీనిపై ప్రతిపక్షాలు బీజేపీపై భగ్గుమన్నాయి. ఐటీ, ఈడీ దాడులన్నీ బీజేపీ స్పాన్సర్ చేస్తున్నవేనని మండిపడ్డాయి. కాగా, కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్, ఆయన సోదరుడు, ఎంపీ డీకే సురేశ్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి సమన్లు పంపింది. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో డీకే సోదరులను ఈడీ గతనెల 7న ఒకసారి ప్రశ్నించింది. తాజాగా సోమవారం మరోసారి తమ ముందుకు రావాల్సిందిగా సమన్లు పంపింది.
అటు.. ఢిల్లీ ఎక్సైజ్ అక్రమాల కేసులో ఉముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా వ్యక్తిగత సహాయకుడు దేవేంద్ర శర్మను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు శనివారం ప్రశ్నించారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ ఆయన స్టేట్మెంట్ను నమోదు చేసింది. తనపై తప్పుడు కేసు పెట్టిన ఈడీ.. తన పీఏ ఇంటిపై దాడి చేసి, ఆయనను అరెస్టు చేసిందని సిసోడియా ఆరోపించారు. ఆ కేసులో ఈడీ పలు విడతలుగా దాడులు చేసింది. సిసోడియాతో పలువురు కీలక వ్యక్తుల ఇండ్లలో ఈడీ సోదాలు నిర్వహించింది. మరోవైపు దేశవ్యాప్తంగా పలు రాష్ర్టాల్లో 33 చోట్ల ఆదాయపు పన్ను శాఖ సోదాలు చేసింది. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, చండీగఢ్, జైపూర్, మహారాష్ట్ర, హర్యానాలో మాంసం ఎగుమతిదారులపై శనివారం దాడులు చేపట్టింది. యూపీకి చెందిన బీఎస్పీ మాజీ ఎమ్మెల్యే జుల్ఫికర్ అహ్మద్ భుట్టోకు చెందిన నివాసం, కార్యాలయం, మాంసం ఫ్యాక్టరీపై ఐటీ విభాగం దాడులు జరిపింది.