నల్లగొండ, మార్చి 16 : వేసవిలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు ఆర్డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శనివారం 1, 2, 4, 7వ స్థాయీ సంఘాల సమావేశాలు జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు అధ్యక్షతన జరిగాయి. 3, 5, 6వ స్థాయీ సంఘాల సమావేశాలు ఆయా సంఘాల చైర్పర్సన్ల అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దులు మాట్లాడుతూ వేసవి పూర్తయ్యే వరకు అధికారులు సమన్వయంతో ఉంటూ తాగునీటికి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు.
ఐదో స్థాయీ సంఘం చైర్మన్ కంకణాల ప్రవీణారెడ్డి మాట్లాడుతూ ఆశ వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు గ్రామీణ ప్రాంతాల్లో బాల్య వివాహాలు కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం తిప్పర్తి జడ్పీటీసీ పాశం రాంరెడ్డి మాట్లాడుతూ డీ-39, 40 కాల్వల కింద నీటి సమస్యను పరిషరించాలని కోరారు. నిడమనూరు మండలం పార్వతీపురంలో డ్రైనేజీ, మిషన్ భగీరథ నీరు కలువడంతో విష జ్వరాలు వస్తున్నాయని, సమస్యను పరిష్కరించాలని సభ్యులు కోరారు. సమావేశాల్లో జడ్పీ సీఈఓ ప్రేమ్కరణ్ రెడ్డి, డిప్యూటీ సీఈఓ శ్రీనివాసరావు, వివిధ శాఖ అధికారులు, సభ్యులు పాల్గొన్నారు.