యాదాద్రి భువనగిరి, జనవరి 12 (నమస్తే తెలంగాణ) ; భువనగిరి పట్టణం రణ క్షేత్రంగా మారింది. ఆందోళనలు, అరెస్టులతో అట్టుడికింది. పోలీసులు పట్టణాన్ని ఆధీనంలోకి తీసుకోవడంతో ఏం జరుగుతుందోననే ఆందోళన రేకెత్తింది. స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యలు, కాంగ్రెస్ నేత కవ్వింపు చర్యలతో రోజంతా టెన్షన్ వాతావరణం నెలకొంది. ఉదయం నుంచే గులాబీ నేతల అరెస్టుల పర్వం కొనసాగింది. పక్కా ప్లాన్ ప్రకారం బీఆర్ఎస్ నేతల ఆందోళనలు, నిరసనలు కొనసాగాయి. మరోవైపు పోలీసుల తీరుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఉదయం నుంచే ఎక్కడికక్కడ అరెస్టులు
బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడికి నిరసనగా భువనగిరి పట్టణంలోని వినాయక చౌరస్తా వద్ద మహాధర్నాకు ఆ పార్టీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు ధర్నా నిర్వహించకుండా చర్యలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ముందస్తు అరెస్టులు చేసి, పోలీస్ స్టేషన్లకు తరలించారు. పల్లె నుంచి పట్నం వరకు గులాబీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. భువనగిరిలోకి రాకుండా మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డిని ఘట్కేసర్ వద్ద అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు. రామన్నపేటలో మాజీ రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, బీబీనగర్‌లో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను, భువనగిరిలో మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నలమోతు భాస్కర్రాను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లోని నాగోల్‌లో ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్ రెడ్డిని, వనస్థలిపురంలో భువనగిరి బీఆర్ఎస్ పార్లమెంట్ ఇన్చార్జి క్యామ మల్లేశ్‌ను, హైదరాబాద్‌లో మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్, నల్లగొండలో మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, గాదరి కిశోర్‌కుమార్, యాదగిరిగుట్టలో డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డిని హౌస్ అరెస్టు చేశారు.
రెచ్చగొట్టేలా కుంభం వ్యాఖ్యలు..!
ఓ వైపు ఉద్రిక్త పరిస్థితుల నెలకొనగా.. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. కాలేజీ మైదానంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. “కాంగ్రెస్, రేవంత్ రెడ్డిపై విమర్శిస్తే యూత్ టెంప్ట్ అవుతారు. దాడులు చేసే ఆస్కారం ఉంటుంది. రేవంత్ రెడ్డి అంటే యూత్‌కు ఎంతో ప్రేమ ఉంటుంది. ఎవరూ ఊరుకోరు. మున్ముందు కూడా ఇట్లనే జరుగతయి” అంటూ కుంభం వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతలు ప్రధాన రహదారిపైకి వచ్చి కవ్వింపు చర్యలకు పాల్పడే ప్రయత్నం చేశారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేసీఆర్ ఫ్లెక్సీని దహనం చేస్తుండగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు.
బీఆర్ఎస్ ఆందోళనల పర్వం..
భువనగిరిలో బీఆర్ఎస్ వరుస ఆందోళనల పర్వం కొనసాగింది. బీఆర్ఎస్ శ్రేణులు నలు దిక్కుల నుంచి ఒకే సారిగా మోహరించాయి. జూనియర్ కాలేజీ ముందు ప్రధాన రహదారిపై బైఠాయించాయి. బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, పార్టీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి ఆందోళనకు దిగారు. వివేకానంద విగ్రహానికి పూలమాల వేసేందుకు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి రావడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. రేవంత్ రెడ్డి, అనిల్ కుమార్‌రెడ్డికి వ్యతిరేకంగా ఫ్లకార్డులు ప్రదర్శించారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి.. అందరినీ అదుపులోకి తీసుకొని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఇదే సమయంలో వినాయక చౌరస్తా వద్ద బీఆర్ఎస్ నేతలు చింతల వెంకటేశ్వర్ రెడ్డి, ఎలిమినేటి సందీప్ రెడ్డి.. బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి ఆందోళనకు దిగారు. ఇదిలా నడుస్తుండగానే ప్రిన్స్ కార్నర్ వద్ద మరో గులాబీ దళం ఆందోళన నిర్వహించింది.
పోలీసుల ఫెయిల్యూర్..!
పోలీసులు ఉదయమే మహాధర్నా ప్రదేశాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎక్కడికక్కడ భారీ సంఖ్యలో బలగాలను మోహరించారు. వినాయక చౌరస్తా చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. జూనియర్ కాలేజీ, ప్రిన్స్ కార్నర్ జగదేవ్‌పూర్ చౌరస్తా, బస్టాండ్ తదితర చోట్ల వద్ద బారికేడ్లు పెట్టారు. ట్రాఫిక్‌ను డైవర్ట్ చేశారు. పట్టణం చుట్టూ చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. వాహనాల్లో వస్తున్న ప్రతి ఒక్కరినీ క్షుణ్నంగా తనిఖీ చేశాకే పట్టణంలోకి అనుమతించారు. కానీ మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి సహా వందలాది బీఆర్ఎస్ కార్యకర్తలు పట్టణంలోకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. తమ ప్లాన్‌ను పక్కాగా అమలు చేశారు. వీరిని అడ్డుకోవడంలో పోలీసులు విఫమయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు పోలీసులు అంబేద్కర్ విగ్రహాన్ని అష్టదిగ్బంధనం చేశారు. పండుగ సమయం కావడంతో పోలీసు తీరుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఇలాంటి దాడులు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు ; మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్
బీఆర్ఎస్ కార్యాలయంపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి. దాడికి నిరసనగా ధర్నాకు పిలుపునిస్తే ఎక్కడికక్కడ అరెస్టులు, నిర్బంధాలు చేశారు. పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి దాడు లు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. సీఎం రేవంత్ ఏకంగా దాడులను సైతం ప్రోత్సహిస్తున్నారు. నిన్న దాడికి పాల్పడిన దుండగులను పోలీస్ స్టేషన్‌కు తరలించకుండా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం తీసుకెళ్లడంలో ఆంతర్యం ఏంటి?
శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వం విఫలం ; మాజీ ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్
హాలియా : రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని, శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్ అన్నారు. అధికారంలో ఉన్నామని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కొందరు రౌడీల్లా వ్యవహరిస్తున్నారని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని విమర్శిస్తే భౌతికదాడులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. హాలియాలో ఆదివారం విలేకరులతో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమని పేర్కొన్నారు. కానీ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక దాడుల సంస్కృతి వచ్చిందని ఆరోపించారు. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం, ఇదేనా ప్రజాపాలన అని ప్రశ్నించారు.
దాడులు ప్రోత్సహిస్తే ప్రతి దాడులు తప్పవు ;మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
మర్రిగూడ : ప్రతిపక్షాలను అణచివేయడం అప్రజాస్వామికమని, నిర్బంధాలతో బీఆర్ఎస్ పార్టీని నిలువరించలేరని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో తన నివాసంలో హౌస్ అరెస్ట్ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ఈ తరహా దాడులు ప్రోత్సహిస్తే ప్రతి దాడులు తప్పవని హెచ్చరించారు. కూసుకుంట్లకు మద్దతుగా మర్రిగూడ మండలంలోని బీఆర్ఎస్ నేతలు ఆయన నివాసం వద్దకు చేరుకొని మద్దతు తెలిపారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు బచ్చు రామకృష్ణ, రామిడి వెంకటరమణారెడ్డి, బాలం నర్సింహ, ఆంబోత్ హరిప్రసాద్ నాయక్ తదితరులు ఉన్నారు.