పెన్‌పహాడ్, అక్టోబరు 08 : వ్యవసాయ పొలం వద్ద ట్రాన్స్ఫార్మర్ ఫ్యూజ్ సరిచేస్తుండగా విద్యుదాఘాతానికి గురై యువ రైతు మృతి చెందిన ఘటన పెన్‌పహాడ్ మండలంలోని మెగ్యతండా ఆవాసం మున్యతండాలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన లకావత్ శ్రీను (45) గురువారం తెల్లవారక ముందే తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్లాడు. అప్పటికే మోటర్ నడవక పోవడంతో ట్రాన్స్ ఫార్మర్ వద్దకు వెళ్లాడు. ట్రాన్స్ఫార్మర్ ఫ్యూజ్‌ను సరిచేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు వరంపై నుండి కాలుజారి ట్రాన్స్ఫార్మర్ ఎర్త్ వైర్‌పై పడడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. శ్రీనుకు భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి భార్య శైలజ ఫిర్యాదు మేరకు ఎస్ఐ బాలు నాయక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.