పెన్పహాడ్, మార్చి 24 : అరెస్టులతో తమ ఉద్యమాన్ని ఆపలేరని బీఆర్ఎస్వీ విద్యార్థి సంఘాల నాయకులు అన్నారు. బీఆర్ఎస్ విద్యార్థి విభాగం అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో మంగళవారం పెన్పహాడ్ మండల బీఆర్ఎస్వీ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యా రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నదని ఆరోపించారు. ఆరు గ్యారంటీల హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తోందన్నారు. బడ్జెట్లో విద్యా రంగానికి నిధులు కేటాయించడంలో పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. విద్యా రంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ తో అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న తమను ముందస్తు అరెస్టులు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అక్రమ అరెస్టులతో బీఆర్ఎస్ చేస్తున్న పోరాటాన్ని ఆపలేరని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. ప్రజా సంక్షేమం కోసం పోరాటాలు తమకు కొత్త కాదన్నారు. విద్యారంగానికి నిధులు కేటాయించే వరకు బీఆర్ఎస్ విద్యార్థి విభాగం పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. అరెస్ట్ అయిన వారిలో ఓగ్గు గోపి, గురవయ్య, వెంకన్న, సైదులు, శ్రవణ్ తదితరులు ఉన్నారు.