యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 27 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామికి మంగళవారం నిత్యారాధనలు వైభవంగా జరిగాయి. తెల్లవారు జూమున ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపారు. అనంతరం తిరువారాధన, ఆరగింపు చేపట్టారు. స్వయంభూ ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లకు నిజాభిషేకం జరిపారు. నిజరూప దర్శనంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారికి తులసి సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన చేపట్టి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ప్రధానాలయ మొదటి ప్రాకార మండపంలో సుదర్శ నారసింహ హోమం జరిపిన అనంతరం స్వామి, అమ్మవార్లను దివ్యమనోహరంగా ముస్తాబు చేసి గజవాహనంపై ఊరేగించారు.
లక్ష్మీనరసింహుడి నిత్య తిరుకల్యాణోత్సవంలో వైభవంగా సాగింది. కల్యాణోత్సవంలో భక్తులు పాల్గొని వీక్షించారు. ప్రధానాలయ ముఖ మండపంలో శ్రీవారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు దఫాలుగా భక్తులతో సువర్ణపుష్పార్చన జరిపించారు. బంగారు పుష్పాలతో దేవేరులకు అర్చన చేశారు. సాయంత్రం స్వామి వారికి తిరువీధి సేవ, దర్బార్ సేవ ఘనంగా నిర్వహించారు. పాత గుట్టలో స్వామివారికి నిత్యారాధనలు వైభవంగా సాగాయి. ప్రధానాలయం, క్యూ కాంప్లెక్స్, శివాలయంలో చెంత గల క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామికి ఆకుపూజను ఘనంగా నిర్వహించారు. హనుమంతుడిని సింధూరంతో అలంకరించి అభిషేకించి లలితాపారాయణం చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి. సుమారు 10 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అన్ని విభాగాలు కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ. 25,10,779 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ రామకృష్టారావు తెలిపారు.