యాదగిరిగుట్ట, జనవరి 12 : యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవాన్ని గురువారం శాస్ర్తోక్తంగా జరిపించారు. ప్రధానాలయ వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం నిర్వహించిన అర్చకులు ఉత్సవమూర్తులను ద్యివ మనోహరంగా అలంకరించి కల్యాణోత్సవ సేవ నిర్వహించారు. అనంతరం కల్యాణ మండపంలో స్వామి, అమ్మవార్లను వెంచేపు చేసి కల్యాణతంతు జరిపించారు. కల్యాణోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెల్లవారుజూమునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పారు. అనంతరం తిరువారాధన జరిపి, ఉదయం ఆరగింపు చేపట్టారు.
స్వయంభూ ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లకు నిజాభిషేకం నిర్వహించారు. స్వామివారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేపట్టి భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శన భాగ్యం కల్పించారు. ప్రధానాలయ ముఖ మండపంలో శ్రీవారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు దఫాలుగా భక్తులకు సువర్ణ పుష్పార్చన పూజలు చేశారు.
బంగారు పుష్పాలతో దేవేరులకు అర్చన చేశారు. సాయంత్రం వేళలో స్వామివారికి తిరువీధి సేవ, దర్బార్ సేవ ఘనంగా నిర్వహించారు. రాత్రి ప్రధానాలయ ముఖ మండపంలో ప్రతిష్ఠామూర్తులకు తిరువారాధన, సహస్రనామార్చన పూజలు చేశారు. పాతగుట్టలో స్వామివారికి నిత్యారాధనలు ఘనంగా నిర్వహించారు. ధనుర్మాసోత్సవాల్లో భాగంగా తెల్లవారుజామున అర్చకులు వేదమంత్రాలు పటిస్తూ అమ్మవార్లకు తిరుప్పావై పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ధనుర్మాస విశిష్టతను భక్తులకు వివరించారు. గోదాదేవి శ్రీరంగనాయకుడిపై రచించిన పాశురాలను పఠిస్తూ అర్చకులు మార్గళి పూజలు నిర్వహించారు. అన్ని విభాగాలు కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ.21,04,264 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.