యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రం దినదినాభివృద్ధి చెందుతున్నది. భక్తుల తాకిడి రోజురోజుకు పెరుగుతున్నది. గతంతో పోలిస్తే ఆలయ ఆదాయం కూడా రెండింతలు అయ్యింది. మరోవైపు భక్తులకు ఇబ్బందులు లేకుండా సదుపాయాలు కల్పించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు పడుతున్నారు.
కేసీఆర్ ప్రభుత్వం సుమారు రూ.1200 కోట్లతో గుట్ట ఆలయాన్ని అత్యద్భుతంగా పునర్నిర్మించింది. ఆ తర్వాత ఆలయ రూపురేఖలే మారిపోయాయి. వెయ్యేండ్ల వరకు చెక్కుచెదరకుండా ఆలయాన్ని నిర్మించారు. 17ఎకరాల్లో ఆలయాన్ని విస్తరించారు. ప్రధానాలయం, కృష్ణశిలతో నిర్మించిన శిల్పాలు, బ్రహ్మోత్సవ మండపం, మాఢవీధులు, ప్రాకారాలు, సప్తతల, పంచతల గోపురాలు, రథశాల, ఆకర్షణీయమైన క్యూకాంప్లెక్స్లు, లక్ష్మీ పుష్కరిణి, వ్రత మండపం, కల్యాణకట్ట, టెంపుల్ సిటీ, ప్రెసిడెన్షియల్ సూట్లు విశేషంగా నిర్మించారు. దీంతో ఆధ్యాత్మికత ఉట్టిపడున్నది.
లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకోవడానికి రాష్ట్రంతోపాటు దేశ, విదేశాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. ఆలయ పునర్నిర్మాణం కంటే ముందు రోజుకు 5వేల మందిలోపు మాత్రమే దర్శనానికి వచ్చేవారు. ప్రస్తుతం రోజుకు సగటున సుమారు 40వేల మంది వరకు భక్తులు స్వామి వారి సేవలో తరిస్తున్నారు. వారాంతాల్లో ఇది మరీ అధికంగా ఉంటుంది. శని, ఆదివారాల్లో 60 నుంచి 70 వేల మంది దాకా విచ్చేస్తున్నారు. పండుగల సమయంలో ఈ సంఖ్య లక్ష దాటుతున్నది. దాంతో కొండపైన, గుట్ట కింద భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి.
పెద్ద సంఖ్యలో భక్తుల రాకతో ఆలయ ఆదాయం కూడా భారీగా పెరిగింది. ఆలయం పునర్నిర్మాణం కంటే ముందు రోజుకు సగటున రూ.10లక్షల లోపు ఉండేది. ఇప్పుడు సగటున రూ.40లక్షలకు పెరిగింది. శని, ఆదివారాల్లో 60 నుంచి 70 లక్షల ఆదాయం వస్తున్నది. ఈ ఏడాది మే 26న ఏకంగా కోటికి పైగా ఆదాయం సమకూరింది. బ్రేక్ దర్శనం, రూమ్ బుకింగ్స్, వ్రతాలు, ప్రసాద విక్రయాలు, సువర్ణ పుష్పార్చన, అన్నదానం, వాహన ప్రవేశం తదితర రూపాల్లో ఆదాయం సమకూరుతున్నది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో రూ. 15.64 కోట్లు, మేలో రూ. 18.90 కోట్ల ఆదాయం వచ్చింది.
భక్తులకు సదుపాయాలు కల్పించేందుకు ఆలయ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈఓగా భాస్కర్ బాధ్యతలు చేపట్టాక దాతల సహకారంతో పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కొండపై భక్తులు నిద్ర చేయడానికి వీలుగా డార్మెంటరీ అందుబాటులోకి తెచ్చారు. నిత్య అన్నదాన సత్రంలో రోజుకు వెయ్యి మందికి అన్నదానం సౌకర్యం కల్పించారు. దీనిని 5వేలకు పెంచేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఎండ, వాన నుంచి ఇబ్బందులు లేకుండా జర్మన్ రెయిన్ వాటర్ ప్రూఫ్ షెడ్ ఏర్పాటు చేశారు. సుమారు 4వేల మంది షెడ్ కింద సేద తీరవచ్చు. కొండపైన మూత్రశాలల సంఖ్య పెంచారు.
స్వామి వారి దర్శనంతోపాటు ఆర్జిత సేవలన్నీ ఆన్లైన్ చేశారు. స్వాతి నక్షత్రం రోజున గిరిప్రదక్షిణకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. గిరి ప్రదక్షిణను ఇటీవల వైభవోపేతంగా నిర్వహించారు. దీనికి భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఆలయ ఆఫీసులు, హోటళ్లు, దుకాణాల్లో ప్లాస్టిక్‌ను నిషేధించి అమల్లోకి తీసుకొచ్చారు. లడ్డూ కౌంటర్ల వద్ద రద్దీ పెరుగడంతో శివాలయానికి ఎదురుగా కొత్తగా లడ్డూ కౌంటర్లు ఏర్పాటు చేశారు. కొండపైన మాతృమూర్తులకు ఫీడింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. క్యూ కాంప్లెక్స్‌లోని క్యూలైన్లలో వాల్ మోటింగ్ ఫ్యాన్లను ఏర్పాటు చేశారు. భక్తుల కోసం ఎల్ఈడీ స్క్రీన్ లను ఏర్పాటు చేసి ఆలయానికి సంబంధించి వివరాలను డిస్ప్లే చేస్తున్నారు.