Padamati Anvitha | భువనగిరి పట్టణానికి చెందిన పర్వతారోహకురాలు పడమటి అన్విత మరో తురాయిని తన కిరీటంలో పొందుపర్చుకున్నారు. అంటార్కిటికా ఖండంలోని అత్యంత ఎత్తైన విన్సన్ పర్వత శిఖరాన్ని అధిరోహించి కొత్త చరిత్రను తన పేరిట లిఖించుకున్నారు. విన్సన్ పర్వతం సముద్ర మట్టానికి 4892 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ట్రాన్సెండ్ అడ్వెంచర్స్ ఇండియాతో కలిసి అంటార్కిటికాలోకి అంతర్జాతీయ యాత్ర బృందంలో భాగమయ్యారు.
భవనగిరి పట్టణానికి చెందిన పడమటి మధుసూదన్నెడ్డి, చంద్రకళ దంపతులకు 1997 లో అన్విత జన్మించింది. తండ్రి వ్యవసాయం చేస్తుండగా, తల్లి అంగన్వాడీ పాఠశాలలో పనిచేస్తున్నది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ చదివిన అన్విత.. భువనగిరిలోని రాక్ క్లైంబింగ్ స్కూల్లో పర్వతాలను ఎక్కే మెళకువలను నేర్చుకున్నారు. తద్వారా పర్వతారోహణను వృత్తిగా ఎంచుకున్నారు. మన దేశంలోని ప్రసిద్ధ సంస్థల నుంచి పర్వతారోహణ కోర్సులను పూర్తి చేసింది. భువనగిరి కోటలో అధిరోహణంపై విస్తృతంగా అభ్యాసం చేసింది. ఇది అక్కడి రాక్ క్లైంబింగ్ స్కూల్ టాప్ మేనేజ్మెంట్లో భాగమైంది. ఈమెకు మెంటార్, కోచ్‌గా బాచినేపల్లి శేఖర్‌బాబు వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో ఎనిమిదో ఎత్తైన పర్వతమైన మౌంట్ మనస్లును కూడా అన్విత అధిరోహించారు.
ఫిబ్రవరి 2021 లో లడఖ్‌లోని ఖాడే పర్వతం, జనవరి 2021 లో కిలిమంజారో పర్వతం, డిసెంబర్ 2021 లో ఎల్బ్రస్ పర్వతం, మే 2022లో ఎవరెస్ట్ పర్వతం, సెప్టెంబర్ 2022 న మౌంట్ మనస్లూ పర్వతాన్ని అధిరోహించారు. మౌంట్ మనస్లూ శిఖరాన్ని చేరుకున్న మొదటి భారతీయ మహిళగా అన్విత చరిత్ర సృష్టించారు. అంటార్కిటికాలోని విన్సన్ పర్వతాన్ని అధిరోహించడం పట్ల అన్విత సంతోషం వ్యక్తం చేసింది. ఈ పర్వతం అధిరోహణకు ఎంతో కష్టపడాల్సి వచ్చిందని, మైనస్ 30 డిగ్రీల వాతావరణంలో క్లైంబింగ్ చేయడం చాలేంజింగ్తో కూడుకున్నదని పడమటి అన్విత చెప్పారు.