యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 25 : ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య గత అసెంబ్లీ ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్ సమర్పించారని దాఖలైన పిటీషన్‌పై నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టులో కేసు విచారణ జరుగుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం గొల్లగూడెంకు చెందిన బొడుసు మహేశ్ ఈ ఎన్నికల పిటీషన్ దాఖలు చేయగా, బీర్ల అయిలయ్య అనతి కాలంలోనే అనేక అక్రమ ఆస్తులు కూడబెట్టారని గురువారం ఆయనపై మరో రెండు ఫిర్యాదులు చేశాడు. వాటిలో హైదరాబాద్‌లోని ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ డైరెక్టర్ (ఇన్వెస్టిగేషన్) కు ఒకటి కాగా, యాంటీ కరప్షన్ బ్యూరో డైరెక్టర్ జనరల్‌కు మరొక ఫిర్యాదు చేశాడు. ఈ సందర్భంగా పిటీషనర్ బొడుసు మహేశ్ విలేకురులకు పలు విషయాలు వెల్లడించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్‌కు బీర్ల అయిలయ్య సమర్పించిన అఫిడవిట్లో తనకు 43 ఎకరాల భూమి ఉన్నట్లు పేర్కొన్నాడు. కానీ తన పేరు, భార్య బీర్ల అనిత పేరున ఉన్న వివిధ రకాల ఆస్తులను వెల్లడించలేదని ఎన్నికల కేసును వేసినట్లు తెలిపాడు.
అంతేకాకుండా ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత బీర్ల అయిలయ్య తన అనుయాయులైన ధనావత్ శంకర్ నాయక్, చాడ భాస్కర్ రెడ్డి, భూక్య రాజారాం, చీర శ్రీశైలం, శిక ఉపేందర్ మరికొందరిని బినామీలుగా చేసుకుని సుమారు 100 ఎకరాల భూమి మేర అక్రమాస్తులు కూడబెట్టారని ఆరోపించారు. ఈ ఆస్తుల విలువ ప్రస్తుత బహిరంగ మార్కెట్లో రూ.200 కోట్ల మేర ఉంటుందన్నాడు. ఇంత తక్కువ సమయంలో అంత సంపదను ఎలా కూడబెట్టారో చెప్పాలని ప్రశ్నించారు. అక్రమాస్తులకు సంబంధించిన అన్ని ఆధారాలను ఏసీబీ, ఆదాయపు పన్ను శాఖ అధికారులకు సమర్పించినట్లు, పూర్తి విచారణ చేసి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరినట్లు తెలిపాడు.

Yadadri Bhuvanagiri : రెండేండ్లలో రూ.200 కోట్ల అక్రమాస్తులు.. ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యపై ఏసీబీ, ఐటీకి ఫిర్యాదు

Yadadri Bhuvanagiri : రెండేండ్లలో రూ.200 కోట్ల అక్రమాస్తులు.. ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యపై ఏసీబీ, ఐటీకి ఫిర్యాదు