నీలగిరి, ఫిబ్రవరి 8 : గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముఠాను నల్లగొండ జిల్లా పోలీసులు పట్టుకున్నారు. ఒడిశా నుంచి గంజాయిని తెచ్చిన ముఠా నల్లగొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాపల్లిలోని పంజాబీ దాబా వద్ద మరో ముఠాకు అప్పగిస్తుండగా దాడిచేసి పట్టుకుని రెండు ముఠాలకు చెందిన ఏడుగురిని అరెస్టు చేశారు. వారి వద్ద ఉన్న 460 కిలో గంజాయి, రూ.4లక్షల నగదు, మూడు కార్లు, 11 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి మంగళవారం నల్లగొండలో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. హైదరాబాద్‌లోని తుర్కయాంజాల్‌కు చెందిన గుడ్లారామ్ వెంకటనారాయణ (గతంలో గంజాయి కేసులో నిందితుడు) టోలిచౌకిలో పానీపూరి వ్యాపారం చేసుకుంటున్న బాణోత్ రమేశ్‌కు పరిచయమయ్యాడు. సులువుగా డబ్బు సంపాదించేందుకు గంజాయి ప్యాకెట్ (2కిలోలు) అమ్మితే రూ.500 కమీషన్ ఇస్తానని చెప్పాడు. ఈ విషయాన్ని సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌కు చెందిన తన సోదరుడు బాణోత్ శాంతకుమార్‌కు చెప్పాడు. అతను తమ గ్రామ సర్పంచ్ ఆడే పుండలిక్ అలియాస్ బాణోత్ పుండలిక్, బాణోత్ వెంకట్‌తో మాట్లాడాడు. దాంతో సర్పంచ్ పుండలిక్‌కు గతంలో పరిచయం ఉన్న మహారాష్ట్రకు చెందిన రాహుల్ గాడ్సేతో గంజాయి అమ్మడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ క్రమంలో రాహుల్ వీరి వద్ద నుంచి గంజాయి తీసుకెళ్లి మహారాష్ట్రలో అమ్ముతున్నాడు. ఇదిలాఉండగా సూర్యప్రకాశ్ అనే వ్యక్తి తనకు పని కల్పించాలని పాత పరిచయమున్న వెంకటనారాయణను కలిశాడు. దాంతో కారు తీసుకుని భద్రాచలం పోయి సత్తిబాబు అనే వ్యక్తిని కలువాలని వెంకటనారాయణ సూర్యప్రకాశ్‌కు చెప్పాడు. సూర్యప్రకాశ్ భద్రాచలం వెళ్లి సత్తిబాబును కలిశాడు. ఇద్దరూ కలిసి ఒడిశాలోని మల్కాన్‌గిరి దగ్గర గంజాయి తీసుకుని వచ్చారు. సత్తిబాబును భద్రాచలంలో దింపిన సూర్యప్రకాశ్.. సరుకు తీసుకుని వచ్చి గుండ్రాపల్లి వద్ద పంజాబీ దాబా హోటల్లో వెంకటనారాయణ, రమేశ్, అతని స్నేహితులకు అప్పగించే క్రమంలో ముందస్తు సమాచారంతో చిట్యాల, టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వెంకటనారాయణ పరార్ కాగా సూర్యాప్రకాశ్తోపాటు ఆరుగురిని అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు.
కేతేపల్లిలో 21 కిలోలు పట్టివేత..
ఆర్టీసీ బస్సులో 21 కిలోల గంజాయి తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. గంజాయి, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని వారిని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ రెమా రాజేశ్వరి తెలిపారు. ఢిల్లీకి చెందిన రాజు అలియాస్ బంతి తనకు గంజాయి కావాలని ఢిల్లీకి చెందిన దీపు సంకార్ను ఆశ్రయించాడు. దీంతో దీపు సంకార్ తనకు పరిచయమున్న ఒడిశాకు చెందిన సుఖంత్ పాడియామి, నీలకంఠతో మాట్లాడాడు. తాను ఖమ్మం వస్తానని సరుకు తేవాలని కోరాడు. ఈ క్రమంలో ఒడిశాలోని బలిమెల చుట్టుపక్కల ప్రాంతాల్లో 21 కిలోల సరుకు కొనుగోలు చేసిన పాడియామి, నీలకంఠ మెటార్ సైకిల్‌పై ఖమ్మం తీసుకొచ్చారు. అక్కడ ముగ్గురూ కలిసి గంజాయిని రెండు భాగాలుగా విభజించి రెండు బ్యాగుల్లోకి మార్చారు. అనంతరం నీలకంఠ తిరిగి ఒడిశాకు వెళ్లగా.. దీపు సంకార్, సుఖంత్ పాడియామి ఢిల్లీ వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులో ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు బయల్దేరారు. ఈ క్రమంలో కేతేపల్లి మండలం కొర్లపాడ్ టోల్గేట్ వద్ద తనిఖీలు చేస్తున్న పోలీసులను చూపి వారు పరారయ్యేందుకు ప్రయత్నించగా పట్టుకున్నారు. వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు. సమావేశంలో డీటీసీ ఎస్పీ సతీశ్ చోడగిరి, నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి, చిట్యాల సీఐ శంకర్‌రెడ్డి, శాలిగౌరారం సీఐ రమణారెడ్డి పాల్గొన్నారు.