సీఎం కేసీఆర్ సభకు తరలివచ్చిన అశేష జనం
యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 12(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : భువనగిరిలో శనివారం జరిగిన కేసీఆర్ బహిరంగ సభ విజయవంతం కావడంతో రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి కృషి ఫలించింది. వారంరోజులుగా మంత్రి ఇక్కడే ఉండి సభ విజయవంతం అయ్యేలా అన్నిచర్యలు తీసుకున్నారు. సభ తేదీ ప్రకటించిన నాటి నుంచే మంత్రి సూచనల మేరకు ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలంతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. సభా స్థలం ఎంపిక నుంచి ఏర్పాట్లు, జన సమీకరణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. మంత్రి నిత్యం సభాస్థలికి వెళ్లి పరిస్థితులను సమీక్షించడంతోపాటు జన సమీకరణ కోసం ఎప్పటికప్పుడు పార్టీ శ్రేణులతో చర్చలు జరిపారు. సభలో వలంటీర్లను నియమించి ఎవరికీ అసౌకర్యం కలుగకుండా చూశారు. పెద్ద ఎత్తున వచ్చిన మహిళలు, వృద్ధులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయించారు. సభ విజయవంతంలో మంత్రి జగదీశ్‌రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి కీలకంగా వ్యవహరించారు. ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేల కృషి ఫలితంగా తరలివచ్చిన అశేష జనాన్ని చూసి సీఎం కేసీఆర్ సైతం సంతృప్తి వ్యక్తం చేశారు.
పటిష్ట భద్రతలో పోలీసులు సక్సెస్..
యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 12(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : భువనగిరిలో శనివారం జరిగిన కేసీఆర్ బహిరంగ సభ కు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. సభకు ఒక రోజు ముందే పోలీసులు సభాస్థలిని తమ ఆధీనంలోకి తీసుకుని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. రాచకొండ సీపీ మహేశ్ భగవత్ నేతృత్వంలో ముగ్గురు డీసీపీలు బందోబస్తు చర్యలను పర్యవేక్షించారు. ఐదు స్పెషల్ పార్టీ బృం దాలు, రెండు రోప్ పార్టీలతోపాటు 12 మంది ఏసీపీలు, 42 మంది సీఐలు, వంద మంది ఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, హోంగార్డులు మొత్తంగా 1500మంది బందోబస్తు విధుల్లో పాల్గొన్నారు. బాంబు డిస్పోజల్, డాగ్ స్కాడ్ బృందం సభా ప్రాంగణంలో అణవణువునా తనిఖీ నిర్వహించింది. రూఫ్ టాఫ్ నిఘా (బైనాక్యులర్) ద్వారా ఎప్పటికప్పుడు భద్రతను పర్యవేక్షించారు. బహిరంగ సభకు తరలివచ్చిన జనాలను పోలీసులు మెటల్ డిటెక్టర్లతో క్షుణ్ణంగా తనిఖీలు చేసి లోనికి అనుమతించారు. ట్రాఫిక్‌కు అవాంతరాలు ఏర్పడకుండా ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టారు. భారీ సంఖ్యలో వచ్చిన వాహనాలను నలుమూలలా ఏర్పాటుచేసిన పా ర్కింగ్ స్థలాల్లో నిలిపేందుకు చర్యలు చేపట్టారు. రాకపోకలకు అవరోధాలు తలెత్తకుండా అవసరమైన చర్యలు వెనువెంటనే చేపట్టారు. ఫలితంగా.. కేసీఆర్ సభ పటిష్ట భద్రత నడుమ ప్రశాంతంగా ముగిసింది.