యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ) : ఎన్నికలు ఏవైనా యాదాద్రి భువనగిరి జిల్లా ఓటర్లు చైతన్యం ప్రదర్శిస్తున్నారు. రికార్డు స్థాయిలో పోలింగ్‌లో పాల్గొంటూ శెభాష్ అనిపించుకుంటున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గాక తాజాగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ టాప్‌లో నిలిచారు.
నల్లగొండ-ఖమ్మం-వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి గురువారం ఎన్నికలు జరగ్గా.. మొత్తం 12 కొత్త జిల్లాల పరిధిలో 24,139 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 93.57 శాతం మంది ఓటు వేశారు. ఇందులో అత్యధికంగా యాదాద్రి భువనగిరి 96.54 శాతం పోలింగ్‌తో తొలి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో సూర్యాపేట(94.97శాతం), నల్లగొండ(94.75శాతం), మహబూబాబాద్(94. 47శాతం) జిల్లాలు ఉన్నాయి.
వరుస ఎన్నికల్లోనూ హవా..
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కంటే ముందు జరిగిన వరుస ఎన్నికల్లోనూ రాష్ట్రంలోనే యాదాద్రి భువనగిరి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలోనూ పోలింగ్ శాతంలో టాప్ ప్లేస్‌లో ఉంది. ఈ స్థానంలో మొత్తం 12 జిల్లాలు ఉండగా యాదాద్రి జిల్లా 78.59శాతం పోలింగ్‌తో అగ్రస్థానంలో నిలిచింది. లోక్‌సభ ఎన్నికల్లో జిల్లాలో రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం నమోదైంది. రాష్ట్రంలోనే అత్యధికంగా పోలింగ్ శాతం నమోదైన పార్లమెంట్ స్థానంగా భువనగిరి రికార్డు నెలకొల్పింది. భువనగిరి పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో కలిపి 76.78శాతం ఓట్లు పోలయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లోనూ జిల్లాలో రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం జరిగింది. రాష్ట్రంలోనే అత్యధికంగా పోలింగ్ శాతం నమోదైన మొదటి జిల్లాగా రికార్డు నెలకొల్పింది. ఆలేరు, భువనగిరి నియోజకవర్గాలు కలిపి మొత్తం 90.36శాతం ఓట్లు పోలయ్యాయి.
జిల్లా ఓటర్ల చైతన్యం..
ఎన్నికలు ఎప్పుడు జరిగినా జిల్లా ఓటర్లు చైతన్యం ప్రదర్శిస్తున్నారు. సాధారణంగా అర్బన్ ప్రాంతాల్లో పోలింగ్ శాతం అతి తక్కువగా నమోదు అవుతుంది. కానీ అర్బన్, సెమీ అర్బన్ ప్రాంతాలు ఎక్కువగా ఉన్న జిల్లాలో మాత్రం ఇంత స్థాయిలో పోలింగ్ నమోదవడం విశేషం. జిల్లాలో ఎన్నికల సమయంలో ఎక్కడా లేనివిధంగా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు స్వచ్ఛందంగా తరలివస్తున్నారు. స్థానికంగా ఉన్న ఓటర్లే కాకుండా ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వారు సైతం పెద్దసంఖ్యలో క్యూ కడుతున్నారు. ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచడంతో అధికారులు కూడా సక్సెస్ అవుతున్నారు.
యాదాద్రి భువనగిరిలో పోలింగ్ నమోదు ఇలా..
ఎన్నిక : పోలింగ్ శాతం
పట్టభద్రుల ఎమ్మెల్సీ : 78.59
పార్లమెంట్ ఎన్నికలు : 76.78
అసెంబ్లీ ఎన్నికలు : 90.36
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ : 93.57