యాదగిరిగుట్ట, డిసెంబర్ 19 : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి సన్నిధిలో స్వామి, అమ్మవార్లకు నిత్యారాధనలు శాస్ర్తోక్తంగా జరిగాయి. మంగళవారం తెల్లవారుజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపారు. అనంతరం తిరువారాధన జరిపి ఉదయం ఆరగింపు చేపట్టారు. ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లకు నిజాభిషేకం చేశారు. స్వామివారు నిజరూప దర్శనంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన చేపట్టి భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శనభాగ్యం కల్పించారు. ప్రధానాలయ మొదటి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం జరిపిన అనంతరం స్వామి, అమ్మవార్లను దివ్యమనోహరంగా ముస్తాబు చేసి గజవాహనంపై వేంచేపు చేసి వెలుపలి ప్రాకార మండపంలో ఊరేగించారు. స్వామి, అమ్మవార్లకు నిత్య తిరుకల్యాణోత్సవం వైభవంగా సాగింది.
అనంతరం లక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా నిత్య తిరుకల్యాణ తంతు జరిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కల్యాణతంతును వీక్షించారు. ప్రధానాలయ ముఖమండపంలో శ్రీవారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు దఫాలుగా భక్తులు సువర్ణ పుష్పార్చనలు జరిపించారు. సాయంత్రం స్వామివారికి తిరువీధి, దర్బార్ సేవలు చేపట్టారు. రాత్రి స్వామివారికి తిరువరాధన చేపట్టి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామివారికి సహస్రనామార్చన జరిపారు. ఆంజనేయస్వామికి ఆకుపూజను ఘనంగా నిర్వహించారు. హనుమంతుడిని సింధూరంతో అలంకరించి అభిషేకించారు. తమలపాకులతో అర్చన చేపట్టారు. స్వామివారికి ఇష్టమైన వడపప్పు. బెల్లం, అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించారు. ధునుర్మాసోత్సవాల్లో భాగంగా ఉదయం 4:30 నుంచి 5:15 గంటల వరకు అర్చకులు వేదమంత్రాలు పఠిస్తూ అమ్మవార్లకు తిరుప్పావై పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ధనుర్మాన విశిష్టతను భక్తులకు వివరించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి. సుమారు13 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అన్ని విభాగాలు కలిపి ఆలయ ఖజానాకు రూ.23,51,559 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ గీత, అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి తెలిపారు.