రాజాపేట, మార్చి 6: వివిధ రోగాలతో ఆసుపత్రికి వచ్చే పేషంట్లకు డాక్టర్లు, వైద్య సిబ్బంది మెరుగైన వైద్యం అందించాలని యాదాద్రి-భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు హితవు చెప్పారు. గురువారం ఆయన రాజాపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డాక్టర్లు, వైద్య సిబ్బంది విధులకు సమయానికి రావాలని ఆదేశించారు. దవాఖానలో చికిత్స పొందుతున్న పేషంట్లను పలకరిస్తూ వసతులు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. వైద్యం సమయానికి అందిస్తున్నారా.. లేదా అని ఆరా తీశారు. హాస్పిటల్ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. హాస్పిటల్లో సానిటేషన్ కోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని స్థానిక ఎంపీడీఓను కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. ప్రజలు ప్రెవేట్ హాస్పిటల్కి వెళ్లి డబ్బులు వృధా చేసుకోకుండా ప్రభుత్వ ఆసుపత్రిలోని అన్ని సౌకర్యాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాజంపేట దవాఖాన నుంచి జిల్లా కేంద్ర దవాఖానకు పంపిన కమలమ్మ అనే గర్భవతి పట్ల దురుసుగా ప్రవర్తించిన సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
రాజాపేట మండలం బొందుగుల గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ హనుమంతరావు సందర్శించారు. పదవ తరగతి పరీక్షలకు మరో 15 రోజుల సమయం మాత్రమే ఉందని చెప్పారు. కనుక ప్రాధాన్యం కల అంశాలపై పట్టు సాధించే దిశగా నిరంతర సాధన చేయాలన్నారు. అలా చేస్తే వెనుక పడి ఉన్న సబ్జెక్టుల్లో విద్యార్థులు 15 రోజులపాటు మరింత కష్టపడితే తప్పక ఉత్తీర్ణులవుతారని చెప్పారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న ప్రీ-ఫైనల్ పరీక్షలు విద్యార్థులు ఎలా రాస్తున్నారని ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు రాసిన ఆన్సర్ షీట్లు స్వయంగా పరిశీలించి, వారు చేసిన తప్పులను సరిదిద్ది అర్ధమయ్యేలా చెప్పారు. కష్టపడి, ఇష్టంతో చదివితే మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావచ్చునని విద్యార్థులకు హితవు పలికారు. చదువులో పదో తరగతి మొదటి మెట్టు అని చెప్పారు.
విద్యార్థులకు మంచి వాతావరణంలో నాణ్యమైన విద్య అందించడానికి కృషి చేయాలని హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులతో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ హనుమంతరావు చెప్పారు. వెనుకబడిన విద్యార్థులకు స్పెషల్ తరగతులు నిర్వహించి, గణితం, ఫిజిక్స్ సబ్జెక్టులపై ఎక్కువ శ్రద్ధ పెట్టేలా చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల జ్ఞాపకశక్తిని పెంచే విధంగా చూడాలన్నారు. పరీక్షలు దగ్గరకు వస్తున్నందున విద్యార్థులు పరీక్షలకు ముందు ఒకటికి రెండు సార్లు చదివి వ్రాస్తూ ప్రాక్టీస్ చేయాలని, మంచి మార్కులు సాధించి తలిదండ్రులకు, జిల్లాకు మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు.
బొందుగుల మండలం లోని పల్లె దవాఖానను జిల్లా కలెక్టర్ హనుమంతరావు అకస్మికంగా తనిఖీ చేశారు. పల్లె దవాఖానలో నిర్వహిస్తున్న ఓపీ రిజిస్టర్ను పరిశీలించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న ఎంఎల్హెచ్పీ మానసపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఎవరిని సహించేది లేదని కలెక్టర్ హెచ్చరించారు. సమయపాలన పాటించాలని స్పష్టం చేశారు.