బొడ్రాయిబజార్, జనవరి 10 : రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎంవీఎన్ భవన్లో నిర్వహించిన పార్టీ జిల్లా కమిటీ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి రానియ్యకుండా అడ్డుకునే దమ్ము కమ్యూనిస్టులకే ఉందన్నారు. బీజేపీ మతోన్మాద విధానాలకు అడ్డుకట్ట వేసేందుకు భవిష్యత్‌లో బీఆర్ఎస్తో కలిసి పని చేస్తామన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. రాష్ట్రంలో వామపక్షాలు బలంగా ఉన్న జిల్లాల్లో బీజేపీ పాగా వేయాలని చూస్తున్నదని, ఇతర పార్టీలో బలమైన నేతలను తమ పార్టీలోకి లాక్కునేందుకు ప్రలోభాలకు గురి చేస్తుందని విమర్శించారు. బీజేపీ మతోన్మాద విధానాలను తిప్పికొట్టేందుకు అన్ని నియోజకవర్గాల్లో సెమినార్లు, సదస్సులు, బహిరంగసభలు నిర్వహించి ప్రజలను చైతన్యం చేస్తామన్నారు.
ఈ నెల 18న బీఆర్ఎస్ పార్టీ ఖమ్మంలో తలపెట్టిన భారీ బహిరంగసభకు కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ హాజరవుతున్నారని తెలిపారు. సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు నెమ్మాది వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి, జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు, ధీరావత్ రవినాయక్, బుర్రి శ్రీరాములు, పారేపల్లి శేఖర్‌రావు, నగారపు పాండు, మట్టిపల్లి సైదులు, కోట గోపి, చెరుకు యాకలక్ష్మి, మేదరమెట్ల వెంకటేశ్వర్రావు, దండ వెంకట్‌రెడ్డి, ఎల్గూరి గోవింద్, బుర్ర శ్రీనివాస్, అనంత ప్రకాశ్, దేవరం వెంకట్‌రెడ్డి, కందాల శంకర్‌రెడ్డి, షేక్ యాకూబ్, పులుసు సత్యం, పల్లె వెంకట్‌రెడ్డి, వేల్పుల వెంకన్న, దనియాకుల శ్రీకాంత్, వీరబోయిన రవి, చిన్నపంగ నర్సయ్య, కొప్పుల రజిత, మద్దెల జ్యోతి, బెల్లంకొండ వెంకటేశ్వర్లు, శేఖర్, నగేశ్ పాల్గొన్నారు.