యాదాద్రి భువనగిరి, జూలై 13 (నమస్తే తెలంగాణ) : ‘అసెంబ్లీ ఎన్నికల్లో అబద్ధపు హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బొందపెట్టాలి. ఎన్నికల్లో భువనగిరి ఖిల్లాపై బీఆర్ఎస్ జెండా ఎగరేసి.. కేసీఆర్‌కు కానుక ఇవ్వాలి’ అని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని పార్టీ కా ర్యాలయంలో ఆలేరు నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూ హంపై చర్చించారు.
అనంతరం మీడియాతో ఆమె మాట్లాడుతూ జిల్లాకు కాళేశ్వరం జలాలు అందించాలనే డిమాండ్‌తో ఉద్యమ బాట పట్టాలన్నారు. మేడిగడ్డను బూచిగా చూపి.. నీళ్లు విడుదల చేయకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద మోటార్ ఆన్ చేసి బస్వాపురం రిజర్వాయర్‌లోకి కాళేశ్వరం నీళ్లు వదలాలని చెప్పారు. రుణమాఫీ, రైతు భరోసా అందలేదని, రైతుకు అండగా నిలిచేందుకు ఆందోళన చేపడతామన్నారు. ప్రభుత్వంపై మరో ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
వారికి అధికారమే పరమావధి
అధికారమే పరమావధిగా కాంగ్రెస్ అడ్డగోలు హామీలు ఇచ్చిందని, అధికారంలోకి వచ్చాక ఏ ఒకటీ అమలు చేయలేదని భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి విమర్శించారు. ఏ గ్రామంలోనూ రైతు రుణమాఫీ చేయలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్నికల సమయంలోనే రైతు భరోసా గుర్తుకు వస్తుందని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ హయాంలో గ్రామాలు సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంటే, నేడు పల్లెల్లో పారిశుద్ధ్యం పడకేసిందని విమర్శించారు. రైతులకు ఎరువులు, యూరియా అందుబాటులో లేదన్నారు. రైతుల సమస్యలను గాలికి వదిలేశారని ఆరోపించారు.
అధికారపార్టీని చిత్తుగా ఓడించాలి
కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీల ఓట్లను దండుకుని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, నేడు బీసీలను మోసం చేసే ప్రయత్నం చేస్తోందని మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్లను తొమ్మిదో షెడ్యూల్లో చేర్చకుండా.. జీవో పేరుతో డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. నాటి ఇందిరాగాంధీ నుంచి నేటి రేవంత్‌రెడ్డి వరకు.. కాంగ్రెస్ బీసీలను వంచిస్తూనే ఉందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్‌కు చావుదెబ్బ ఖాయం
18 నెలల కాలంలో ఏ ఒక్క హామీని కాంగ్రెస్ అమలు చేయకుండా అన్ని వర్గాలను మోసం చేసిందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి విమర్శించారు. రేవంత్‌రెడ్డికి కలలోనూ కేసీయారే గుర్తుకు వస్తున్నారన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చావు దెబ్బ ఖాయమన్నారు.
కాంగ్రెస్ తొత్తులుగా అధికారులు
కాంగ్రెస్ హయాంలో జిల్లాలో పాలన పడకేసిందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కల్లూరు రామచంద్రారెడ్డి విమర్శించారు. అధికార పార్టీ నేతలకు అధికారులు తొత్తులుగా మారారని ఆరోపించారు. మట్టి, ఇసుక, భూ మాఫియా చేతిలో కీలు బొమ్మలుగా మారారన్నారు. కాంగ్రెస్ ఎల్లకాలం అధికారంలో ఉండదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ప్రజాస్వామ పద్ధతుల్లో ప్రజలకు సేవ చేయాలని కోరారు. బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడతామని కాంగ్రెస్ నేతలు భయపెడుతున్నారని మండిపడ్డారు.
వల్లకాడుగా మారుతున్న పల్లెలు
కేసీఆర్ హయాంలో పల్లెల అభివృద్ధికి అద్భుతమైన పథకాలు తీసుకొచ్చారని, విప్లవాత్మక కార్యక్రమాలు అమలు చేశారని బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి చెప్పారు. గ్రామాలు నేడు వల్లకాడులా మారాయని మండిపడ్డారు. బీఆర్ఎస్ నేత క్యామ మల్లే ష్, మాజీ జెడ్పీ చైర్మన్ ఎలిమినే టి సందీప్ రెడ్డి, బీరు మల్ల య్య, ఏవీ కిరణ్, రచ్చ శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.