– శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
– సీపీఏ ఆధ్వర్యంలో స్విట్జర్లాండ్ పార్లమెంట్ భవన సందర్శన
నల్లగొండ, అక్టోబర్ 08 : ప్రజాస్వామ్య వ్యవస్థల అధ్యయనంతో పార్లమెంటరీ విధానాలపై మరింత అవగాహన పెంపొందించుకోవచ్చని రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. స్విట్జర్లాండ్ దేశంలోని బెర్న్ నగరంలో ఉన్న చారిత్రాత్మక పార్లమెంట్ భవనాన్ని శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ తో కలిసి గురువారం ఆయన సందర్శించారు. కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ (CPA) ఆధ్వర్యంలో చేపట్టిన విదేశీ అధ్యయన పర్యటనలో భాగంగా తెలంగాణ శాసన వ్యవస్థ ప్రతినిధుల బృందం స్విట్జర్లాండ్ పార్లమెంట్ భవనాన్ని సందర్శించింది. ఈ సందర్భంగా స్విట్జర్లాండ్ పార్లమెంటరీ వ్యవస్థ, ప్రజాస్వామ్య సంప్రదాయాలు, శాసనసభల పనితీరు, చట్టాల రూపకల్పన విధానాలు, ప్రజాప్రతినిధుల బాధ్యతలు తదితర అంశాలపై అధ్యయనం చేయడం ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో శాసనసభలు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తాయని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా చట్టాలను రూపొందించడం, ప్రభుత్వ విధానాలపై చర్చించడం, ప్రజా సమస్యలకు పరిష్కార మార్గాలను అన్వేషించడం ప్రజాప్రతినిధుల ప్రధాన బాధ్యతగా ఆయన తెలిపారు.
ప్రపంచంలోని వివిధ దేశాల పార్లమెంటరీ వ్యవస్థలను అధ్యయనం చేయడం ద్వారా ప్రజాస్వామ్య విలువలు, శాసనసభల నిర్వహణ, పారదర్శకత, జవాబుదారీతనం వంటి అంశాలపై మరింత అవగాహన పెంపొందించుకునే అవకాశం ఉంటుందని వివరించారు. స్విట్జర్లాండ్ దేశం ప్రత్యక్ష ప్రజాస్వామ్య విధానాలకు ప్రత్యేక గుర్తింపు పొందిందన్నారు. ప్రజల భాగస్వామ్యానికి ప్రాధాన్యతనిచ్చే అక్కడి ప్రజాస్వామ్య విధానాలు అధ్యయనం చేయదగినవి అని , ఇలాంటి అంతర్జాతీయ అధ్యయన పర్యటనల ద్వారా లభించే అనుభవాలు తెలంగాణ రాష్ట్ర శాసన వ్యవస్థను మరింత సమర్థవంతంగా, ప్రజలకు చేరువగా తీర్చిదిద్దేందుకు ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి సెక్రెటరీ డా.నరసింహాచార్యులు, శాసన సభ స్పీకర్ ఓఎస్డీ వెంకటేష్ పాల్గొన్నారు.