దామరచర్ల మండలం పరిధిలో కృష్ణా, మూసీ నదులతోపాటు అన్నవేరు, హాలియా వాగులు నిత్యం ప్రవహిస్తుంటాయి. వాటి నుంచి నీళ్లు దిగువకు వృథాగా వెళ్తుంటాయి. ఇక్కడి గ్రామాలు ఎత్తయిన ప్రాంతంలో ఉండడంతో నీరందని పరిస్థితి. పంటలకు సాగునీరు లేక రైతులు పొలాలను బీడుగా వదిలేసిన దుస్థితి. సాగునీరు అందించాలని ఉమ్మడి రాష్ట్రంలో నాటి పాలకులకు ఎన్ని విజ్ఞప్తులు చేసినా పట్టించుకోలేదు. స్వరాష్ట్రంలో రైతులు, ప్రజల కష్టాలు తీర్చేందుకు సీఎం కేసీఆర్ ముందుకు వచ్చారు. ఇప్పటికే సాగర్ ఎడమ కాల్వ ద్వారా దామరచర్ల మండల పరిధిలో అవకాశం ఉన్న మేరకు చివరి భూములకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇక మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలను సస్యశ్యామలం చేసేందుకు రూ.305.83 కోట్లతో రెండు ఎత్తిపోతల పథకాలకు శ్రీకారం చుట్టారు.
దామరచర్ల మండలంలోని తాళ్లవీరప్పగూడెంలో అన్నవేరు వాగుపై రూ. 75.93 కోట్లతో చేపడుతున్న బొత్తలపాలెం-వాడపల్లి ఎత్తిపోతల పనులు 30 శాతం పూర్తయ్యాయి. అప్రోచ్ చానల్ పనులు సగం వరకు కాగా త్వరలో పైప్‌లైన్ పనులను మొదలు పెట్టనున్నారు. ఈ లిఫ్ట్ పూర్తయితే 6 గ్రామాల పరిధిలో అదనంగా 5,875 ఎకరాలకు సాగునీరు అందనున్నది.
ఇదే మండలంలోని లావూరితండా సమీపంలో మూసీ నది వద్ద కేశవాపురం ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తున్నారు. దీనికి ప్రభుత్వం రూ.229.90 కోట్లు కేటాయించగా 50 శాతం పనులు పూర్తయ్యాయి. పంప్‌హౌస్, ఇంటెక్వెల్, పైప్‌లైన్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. దీని ద్వారా 10 గ్రామాల్లో అదనంగా 12,610 ఎకరాలు సాగులోకి రానున్నాయి. వృథా నీటికి చెక్ పెట్టి ఎత్తిపోతల ద్వారా నీరందించేందుకు ప్రభుత్వం కృషి చేయడంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
దామరచర్ల, మే 18 : మండలానికి ఒకవైపు కృష్ణా, మూసీ నదులు.. మరో వైపు అన్నవేరు వాగు ప్రవహిస్తూ దిగువకు నీరు వృథాగా పోతున్నా గత ప్రభుత్వాలు, పాలకులు పట్టించుకోలేదు. నాన్ ఆయకట్టులో మంచి సారవంతమైన భూములున్నప్పటికీ సాగునీరు అందక బీళ్లుగా మారాయి. నాగార్జునసాగర్ ఎడమ కాల్వ పరిధిలో ముదిమాణిక్యం, వజీరాబాద్ మేజర్లు ఉన్నా ఆ ఊర్లకు ఎన్నడూ నీళ్లు రాని పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ చేపట్టిన చర్యల వల్ల నేడు చివరి భూములకూ నీరందుతున్నది. దీంతోపాటు మిషన్ కాకతీయలో చెరువుల మరమ్మతులు చేపట్టి ప్రతి ఏటా సాగర్ జలాలతో నింపడంతో భూగర్భ జలాలు పెరిగి బోర్లు పుష్కలంగా పోస్తున్నాయి. దీంతోపాటు స్థానిక ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు ప్రత్యేక చొరవతో మండలానికి రూ.305.83 కోట్లతో రెండు ఎత్తిపోతల పథకాలను సీఎం కేసీఆర్ మంజూరు చేశారు. పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. అవి పూర్తయితే మండలంలో 18,485 ఎకరాలకు సాగునీరు అందనుంది.
Nalgonda6
బొత్తలపాలెం ఎత్తిపోతలతో 5,875 ఎకరాలు సాగులోకి..
పెద్దదేవులపల్లి నుంచి వచ్చే అన్నవేరు వాగు నిత్యం ప్రవహిస్తూ వందలాది క్యూసెక్కుల నీరు తాళ్లవీరప్పగూడెం శివారులో కృష్ణానదిలో కలుస్తుంది. ఈ నీరు వృథాగా దిగువన ఆంధ్రాలోని పులిచింతలకు తరలిపోతుండగా.. ఈ ప్రాంతంలో రూ.75.93 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం లిఫ్ట్ ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించింది. ఈ మేరకు దామరచర్ల మండలంలో ఒక భాగానికి సాగు నీరు అందించేందుకు తాళ్లవీరప్పగూడెం శివారులోని అన్నవేరు, హాలియా నదుల సంగమం వద్ద ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభమయ్యాయి. అనుకున్న సమయంలో పూర్తి చేసేందుకు పనులు శరవేగంగా చేపడుతున్నారు. దీని ద్వారా 9కిలోమీర్ల పరిధిలో పైపులైన్ ఏర్పాటు చేసి బొత్తలపాలెం వద్ద దుప్పలగట్టు వజీరాబాద్ మేజర్ ఆర్-9 వద్ద ఒకటి, నర్సాపురం చెరువులో మరో పైపులైన్ డెలివరీ పాయింట్లుగా ఏర్పాటు చేస్తున్నారు. దీంతోపాటు వీరప్పగూడెం పరిధిలోని వజీరాబాద్ మేజర్ ఆర్-8 పైభాగాన మరో పైపులైన్‌తో నీటిని అనుసంధానం చేయనున్నారు. దీనిద్వారా బొత్తలపాలెం, వాచ్యాతండా, నర్సాపురం, దామరచర్ల, టీవీగూడెం, వాడపల్లి గ్రామాల పరిధిలో సుమారు 5,875 ఎకరాల భూమి అదనంగా సాగులోకి రానుంది.
వేగవంతంగా బొత్తలపాలెం- వాడపల్లి లిఫ్ట్ పనులు
మండలంలోని తాళ్లవీరప్పగూడెం సమీపంలో కృష్ణా, అన్నవేరు వాగు సంగమం వద్ద చేపట్టిన బొత్తలపాలెం – వాడపల్లి ఎత్తిపోతల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే 30 శాతం పనులు పూర్తయ్యాయి. గడువులోపు పూర్తి చేసి నీరు అందించేందుకు రాత్రి, పగలు పనులు చేస్తున్నారు. ప్రస్తుతం నది నుంచి పంప్‌హౌజ్ వరకు అప్రోచ్ పనులు కొనసాగుతున్నాయి. పంపుహౌజ్ పనులు 70శాతం, అప్రోచ్ చానల్ పనులు 30 శాతం పూర్తి కాగా.. పైపులైన్ పనులను త్వరలో ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు.
కేశవాపురం ఎత్తిపోతల 50శాతం పూర్తి
మూసీ నది నుంచి నిత్యం వేలాది క్యూసెక్కుల నీరు వాడపల్లి వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. వృథాగా పోతున్న ఈ నీటిని కొంత వరకైనా ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో మండలంలోని కేశవాపురం గ్రామ పరిధిలోని మంగళదుబ్బతండా సమీపంలో లిఫ్ట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రూ.229.90 కోట్లు విడుదల చేసింది. ఇప్పటికే 50శాతం పనులు పూర్తయ్యాయి. పంప్‌హౌజ్ 80 శాతం పూర్తికాగా, మరో స్లాబ్ వేస్తే పూర్తవుతుంది. నదిలో ఇంటెక్వెల్ పనులు 40 శాతం అయిపోయాయి. పంప్‌హౌజ్ నుంచి నీరు ఔట్ఫుట్కు 8 కిలోమీటర్ల దూరం పైప్‌లైన్ వేయాల్సి ఉండగా.. 3కి.మీ.పూర్తయింది. మోటర్లు గుజరాత్ నుంచి తెప్పిస్తున్నారు. ఈ లిఫ్ట్ నుంచి రెండు పైపులైన్లు ఏర్పాటు చేశారు. వాటిని వజీరాబాద్ ఆర్-8/ఎల్2, ఆర్-8/ఎల్4 మేజర్లలో కలుపుతారు. దీని ద్వారా కొండ్రపోల్, బొత్తలపాలెం, నూనావత్తండా, మాన్తండా, ధనియాలతండా, జేత్రాంతండా, ఎల్బీతండా, తెట్టకుంట, మంగళితండా, లావూరితండా పరిధిలోని 12,610 ఎకరాలు అదనంగా సాగులోకి వస్తుంది.
లిఫ్ట్‌లతో దామరచర్ల మండలం సస్యశ్యామలం
చివరి భూముల రైతుల సమస్యలను గత పాలకులు పట్టించుకోలేదు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టులకు ఎంతో ప్రాధాన్యమిస్తున్నారు. దామరచర్ల మండలంలో రెండు ఎత్తిపోతల పథకాలకు సీఎం కేసీఆర్ రూ.305.83 కోట్లు విడుదల చేశారు. పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. నిర్ణయించిన గడువులోపు పనులు పూర్తి చేసి సాగునీరు అందిస్తాం. ఇవి పూర్తయితే మండలంలో 18వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. నాడు ఎన్నికల్లో ఇచ్చిన హామీని సీఎం కేసీఆర్ చొరవతో నెరవేర్చుకున్నా.
– ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు