చిట్యాల, జూన్ 5 : నల్లగొండ జిల్లా చిట్యాల మండల పరిధిలో ఆదివారం తెల్లవారు జామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. వీరిలో తల్లి, కూతురు, కుమారుడు ఉన్నారు. ఇందుకు సంబంధించి ఎస్సై రవికుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీలోని కాకినాడ జిల్లా భానుగుడి మండలం శ్రీరాంనగర్‌కు చెందిన మలిరెడ్డి వీరవెంకట నాగ వర ప్రసాద్ బాబు హైదరాబాద్ యూసుఫ్‌గూడ ప్రాంతంలోని మధురానగర్‌లో కుటుంబంతో ఉంటున్నాడు. వర ప్రసాద్, భార్య విజయలక్ష్మి (40), కూతురు శ్రియ(17), కుమారుడు ప్రభవ్(12), స్నేహితుడు ఫిలిం ఎడిటర్ హైదరాబాద్ గుండ్లపొచంపల్లిలో నివసించే కట్టా శ్రీకర్ ప్రసాద్(62)తో కలిసి చైన్నై వెళ్లి కారులో తిరిగి హైదరాబాద్ వస్తున్నారు. కాగా కారును వరప్రసాద్ నడుపుతున్నాడు.
వీరు ప్రయాణిస్తున్న కారు ఆదివారం తెల్లవారు జామున 5 గంటల ప్రాంతంలో మండలంలోని పెద్దకాపర్తి గ్రామ శివారులోకి చేరుకోగానే వెనుక నుంచి వచ్చిన ట్రావెల్స్ బస్సు అతి వేగంగా, అజాగ్రత్తగా వచ్చి ఢీ కొట్టింది. ఈ సంఘటనలో కారులో ప్రయాణిస్తున్న విజయలక్ష్మి, కూతురు శ్రీయ, కుమారుడు ప్రభవ్, శ్రీకర్ ప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందారు. వరప్రసాద్‌కు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే సీఐ సురేష్, ఎస్సై రవికుమార్ సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వరప్రసాద్‌ను చికిత్స నిమిత్తం నార్కట్‌పల్లిలోని కామినేని దవాఖానకు తరలించారు. ప్రమాదంలో కారు నుజ్జు కావటంతో అందులో ఇరుక్కుపోయిన మృతదేహాలను వెలికితీసేందుకు పోలీసులు గ్యాస్ కట్టర్‌ను ఉపయోగించారు. అనంతరం మృతదేహాలను నల్లగొండ ప్రభుత్వ దవాఖానకు తరలించి కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై రవికుమార్ వివరించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ.. పెద్దకాపర్తి శివారులో జరిగిన రోడ్డు ప్రమాద స్థలాన్ని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదివారం మధ్యాహ్నం పరిశీలించారు. ఈ సందర్భంగా సీఐ సురేష్ ప్రమాదం జరిగిన తీరును ఎస్పీకి వివరించారు. కార్యక్రమంలో ఎస్సై రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.