చందంపేట, అక్టోబర్ 3 : దసరా పండుగ సందర్భంగా తుల్జా భవాని అమ్మవారికి మొక్కులు చెల్లించేందుకు వచ్చి ముగ్గురు మృత్యువాత పడిన ఘటన నల్లగొండ జిల్లా చందంపేట మం డలం దేవరచర్ల గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…చందంపేట మండలం దేవరచర్ల గ్రామంలో తుల్జా భవాని అమ్మవారిని దర్శించుకొని మొక్కు లు చెల్లించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెనాలికి చెందిన కేతావత్ రాము(32), వినుకొండ పరిధిలోని బొల్లపల్లి మం డలం గండిగనుముల గ్రామానికి చెందిన వాంకుడావత్ బాలాజినాయక్ కుమారుడు వాంకుడావత్ పూర్ణ గోపాలభరత్ (22), అవనిగడ్డకు చెందిన జటావత్ నాగేశ్వర్రావు, నాగమణిల ఏకైక కుమారుడు ఉమాసాయికాంత్(11)తో పాటు పలు కుటుంబాలు సెప్టెంబర్ 30న రాత్రి ఇక్కడికి వచ్చారు.
ఈ నెల 1న దేవరచర్లలో కృష్ణా నది వెనుక డిండి ప్రాజెక్టు జలాలు కలిసే వాగులో స్నానం ఆచరించి.. అమ్మవారికి పూజలు చేశా రు. దసరా రోజు పూజ ముగించుకొని తిరుగు ప్రయాణమయ్యేందుకు చివరగా వాగులో స్నానం చేయడానికి వెళ్లారు. మొదట ఉమా సాయికాంత్ స్నానం చేసేందుకు వాగులోకి దిగాడు. లోతు గుర్తించలేక నీట మునిగిపోయాడు. ఉమా సాయికాంత్ను రక్షించేందుకు కేతావత్ రాము, పూర్ణ గోపాల భరత్ నీటిలోకి దిగారు. వీరెవ్వరికీ ఈత రాకపోవడం వాగు లోతు అంచనా వేయలేక ముగ్గురూ నీట మునిగి మృత్యువాతపడ్డారు. సమాచారం అందుకున్న డిండి సీఐ బీసన్న, చందంపేట ఎస్ఐ లోకేశ్ ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. గురువారం (పండుగరోజు) రాము, పూర్ణ గోపాల భరత్‌ల మృతదేహాలు, శుక్రవారం ఉమా సాయికాంత్ మృతదేహం లభ్యమైంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ఏరియా దవాఖానకు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
దేవరచర్ల ఘటనలో మృతి చెందిన ముగ్గురు మృతుల్లో వాంకుడావత్ పూర్ణ గోపాలభరత్ చిన్నతనంలోనే తల్లి మరణించింది. తండ్రి కుమారుడిని డాక్టర్ చేయాలనే తలంపుతో కష్టపడి ఎం బీబీఎస్ చేయిస్తున్నాడు. ప్రస్తుతం ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న పూర్ణ గోపాల భరత్ మృతితో ఆ తండ్రి గుండెలలిసేలా రోధిస్తున్నాడు. ఉమాసాయికాంత్ వారి వంశం లో ఏకైక మగ సంతానం కావడంతో అల్లారుముద్దుగా పెరిగాడు. ఏకైక కుమారుడు విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెనాలి ప్రాంతంలో ఓ హోటల్లో పని చేస్తున్న కేతావత్ రాము మరణంతో భార్య, ఇద్దరు కుమారులు కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయారు.