నల్గొండ రూరల్, మార్చి 12 : సాగునీరందక వేలాది ఎకరాల్లో వరి పొలాలు ఎండిపోయి, రైతులు ఆర్థికంగా నష్టపోతున్నట్లు బీజేపీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి అన్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీన వైఖరి కారణమని ఆయన దుయ్యబట్టారు. బుధవారం నల్లగొండ మండల పరిధిలోని రాములబండ, రంగారెడ్డి నగర్ గ్రామాల్లో ఎండిపోయిన పంట పొలాలను పార్టీ నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉదాసీన వైఖరి, తగిన సాగునీటి ప్రణాళిక లేని కారణంగా వేలాది ఎకరాల్లో పంటలు చేతికండపోయినట్లు తెలిపారు. చెరువులు, రిజర్వాయర్లు పూర్తిగా దెబ్బతిన్నా ప్రభుత్వం పట్టించుకో లేదన్నారు. గ్రీన్ సిగ్నల్ లేని మోటార్లు, బోర్లు వేసినా భూగర్భ జలాలు అడుగంటడం, కరెంట్ సరఫరా సరిగ్గా లేకపోవడం వంటి సమస్యలతో రైతులు దిక్కుతోచని స్థితి ఉన్నారన్నారు.
రైతుల సంక్షేమం కోసం ప్రకటించిన పథకాలు చేతులు కాల్చేలా మారాయన్నారు. పరిహారం లేకపోవడం, నష్టపోయిన రైతులకు ఎలాంటి భరోసా ఇవ్వకుండా ప్రభుత్వం మౌనం వహిస్తోందన్నారు. భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఈ విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురానున్నట్లు చెప్పారు. రైతుల హక్కుల కోసం పోరాడుతూ, వారి సమస్యలను అధికారులకు, ప్రజలకు తెలియజేయడమే లక్ష్యంగా బీజేపీ ముందుకు సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యుడు గోలి మధుసూదన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకుడు వీరెల్లి చంద్రశేఖర్, జిల్లా జనరల్ సెక్రెటరీ పొత్తపాక లింగస్వామి, మండల అధ్యక్షులు అనిల్, జిల్లా కోశాధికారి పకీరు మోహన్ రెడ్డి, యువ మోర్చా నాయకుడు పెన్నింటి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.