మోత్కూరు, మే 25 : మోత్కూరు మున్సిపాలిటీలో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలపై విచారణ కరువైంది. ప్రజల నుంచి ముక్కు పిండి వసూలు చేసిన పన్నులు ఇంకా ప్రభుత్వ ఖజానాలో జమకు నోచుకోలేదు. మున్సిపల్ బిల్ కలెక్టర్లు ప్రజల నుంచి వసూలు చేసిన రూ.20 లక్షలను సొంతానికి వాడుకున్న అవినీతిపై ఈ నెల 13తేదీన నమస్తే తెలంగాణలో వెలుగులోకి తెచ్చిన విషయం విదితమే. సిబ్బంది వాడుకున్న పన్నులను15వ తేదీ వరకు ప్రభుత్వ ఖజానాకు జమ చేయించాలని మున్సిపల్ కమిషనర్ కె.సతీశ్‌కుమార్‌ను మున్సిపల్ ప్రత్యేకాధికారి, అదనపు కలెక్టర్ వీరారెడ్డి ఆదేశించారు. పదిరోజులు గడిచినా వసూలు చేసిన పన్నుల సొమ్ము రికవరీకి నోచుకోకపోవడం గమనార్హం. మున్సిపాలిటీలో జూనియర్ అసిస్టెంట్లు, వార్డు ఆఫీసర్లు విధులను నిర్వహిస్తున్నారు. ఔట్ సోర్పింగ్లో పని చేస్తున్న ఎనిమిది మంది సిబ్బంది బిల్ కలెక్టర్ల బాధ్యతలు చేపడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పర్యవేక్షణలోనే ఔట్ సోర్సింగ్ సిబ్బంది పని చేయాల్సి ఉంది.
ప్రత్యేకాధికారుల పాలనలో పర్యవేక్షణ కొరవడడంతో ఔట్ సోర్సింగ్ సిబ్బంది బిల్ కలెక్టర్ల అవతారమెత్తి అందినకాడికి దోచుకున్నారన్నా ఆరోపణలు ఉన్నాయి. ఒకరిద్దరు బిల్ కలెక్టర్లు ప్రభుత్వ ఉద్యోగుల పేరున బిల్లింగ్ యంత్రాలను తీసుకొని ప్రజల నుంచి పలు రకాల పన్నులు వసూలు చేశారని తెలిసింది. ఇప్పుడా బిల్ కలెక్టర్లు ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులను ప్రభుత్వ ఖజానాకు జమ చేయకుండా సొంతానికి వాడుకొని దుర్వినియోగంకు పాల్పడ్డారన్నా ఆరోపణలు ఉన్నాయి. 15వరకు వాడుకున్న పన్నులను జమ చేయని సిబ్బందిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అదనపు కలెక్టర్ వీరారెడ్డి చేసిన ఆదేశాలను మున్సిపల్ అధికారులు ఖాతరు చేయడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దుర్వినియోగమైన మున్సిపల్ పన్నుల రికవరీపై జిల్లా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని, తాము చెల్లించిన పన్నులను ఆన్లైన్ అప్డేట్ జరిగేలా చర్యలు తీసుకోవాలని మున్సిపాలిటీ ప్రజలు కోరుతున్నారు.