రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్ల సర్వే నత్తనడకన నడుస్తున్నది. దరఖాస్తుల పరిశీలన నిర్దేశించుకున్న లక్ష్యానికి దూరంగా ఉంది. సర్వర్ సతాయింపులు, నెట్వర్క్ సమస్యల వంటి కారణాలతో ఆలస్యమవుతున్నదని అధికారులు చెబుతున్నారు. ఈ నెల 31 వరకు గడువు ఉండగా, అప్పటిలోగా సగమైనా అవుతుందా.. లేదా..? అన్నది ప్రశ్నార్ధకంగా మారింది.
ఇందిరమ్మ ఇండ్ల పథకానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం తొలి విడతలో సొంత స్థలం ఉన్న వారికి ఇండ్ల నిర్మాణం కోసం రూ.5 లక్షల సాయం చేస్తామని ప్రకటించింది. ఒక్కో నియోజకవర్గానికి 3,500 మంది లబ్ధిదారులను గుర్తించనుంది. గతేడాది డిసెంబర్లో ప్రజా పాలనలో భాగంగా వివిధ పథకాల అమలు కోసం దరఖాస్తులను స్వీకరించారు. జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల కోసం 2,01,977 అప్లికేషన్లు వచ్చాయి. వారిలో అర్హులను గుర్తించేందుకు సర్వే నిర్వహిస్తున్నారు. ఈ నెల 11 నుంచి దరఖాస్తుల పరిశీలన సాగుతున్నది. జిల్లాలో 421 గ్రామపంచాయతీలతోపాటు మున్సిపాలిటీల్లో 104 వార్డుల్లో సర్వే నడుస్తున్నది. గ్రామాల్లో ఒక్క గ్రామ పంచాయతీకి కార్యదర్శి, మున్సిపాలిటీల్లో వార్డుకు ఒకరు అప్లికేషన్లను పరిశీలిస్తున్నారు. మొత్తంగా 630 మంది వరకు సర్వేలో పాల్గొంటున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో సర్వే చాలా ఆలస్యంగా సాగుతున్నది. మొత్తం దరఖాస్తుల్లో ఇప్పటి వరకు 44,040 దరఖాస్తులు.. అంటే, 21.89 శాతం మాత్రమే క్లియర్ అయ్యాయి. అర్బన్ ప్రాంతాల్లో 47.87శాతం కాగా, అత్యధికంగా మోత్కూరు మున్సిపాలిటీలో 72.86 శాతం సర్వే పూర్తయ్యింది. మండల వారీగా పరిశీలిస్తే మొత్తంగా 17.5 శాతం మాత్రమే అయ్యింది. గుండాలలో అతి తక్కువగా 12.48 శాతమే చేశారు. ఆ తర్వాత భువనగిరి మండలంలో 13.33శాతం, వలిగొండ 13.55శాతం, అడ్డగూడూరులో 15.40శాతం, చౌటుప్పల్‌లో 15.71శాతం, ఆత్మకూర్ (ఎం)లో 15.78శాతం, రాజాపేటలో 15.90శాతం, నారాయణపురంలో 16.80 శాతం పూర్తయ్యింది. ఈ నెల 31 వరకు పూర్తి చేయాలని ఆదేశాలు ఉండగా, అప్పటిలోగా సాధ్యమయ్యే అవకాశాలు కనిపించడం లేదు.
సాంకేతిక సమస్యలే అధికం
సర్వే స్లోగా జరుగడానికి సాంకేతిక సమస్యలు అధికంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. దరఖాస్తుదారుల వివరాలను యాప్‌లో అప్లోడ్ చేయాల్సి ఉంది. 30 నుంచి 35 ప్రశ్నల ఆధారంగా వివరాలను సేకరించి, ఆన్లైన్లో ఎంట్రీ చేయాలి. పెద్ద సంఖ్యలో యాప్‌లో వివరాలు అప్లోడ్ చేస్తుండడంతో సర్వర్‌పై భారం పడుతున్నది. అంతేగాక గ్రామీణ ప్రాంతాల్లో నెట్వర్క్ సమస్య తీవ్రంగా ఉంది. యాప్‌లో వివరాలను అప్లోడ్ చేయడానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఒక్కో దరఖాస్తుదారు ఇంటి వద్ద గంటల కొద్దీ నిరీక్షించాల్సి వస్తున్నది. కొందరు ప్రజా పాలనలో పొందుపరిచిన చిరునామాల్లో అందుబాటులో ఉండడం లేదు. ఈ క్రమంలో ఒక్కొక్కరు రోజుకు 10 నుంచి 15 దరఖాస్తులు మాత్రమే పూర్తి చేయగలుగుతున్నారు.