నల్లగొండ రూరల్, జూన్ 13: జిల్లా రైతుల సహకారం, ప్రభుత్వ మద్దతుతో బత్తాయి సాగులో నల్లగొండను దేశానికే ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండలోని పోలీసు ఆడిటోరియంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సిట్రస్ సెమినార్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. గతంలో 4 లక్షల ఎకరాల్లో బత్తాయి సాగు కాగా.. కాలక్రమేణా అది 40 వేల ఎకరాలకు తగ్గడం విచారకరమన్నారు. వరిపైనే ఆధారపడకుండా బత్తాయి, ఇతర ఉద్యాన పంటలను సాగు చేయాలన్నారు.
పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, రైతు కమిషన్ చైర్మర్ కోదండరెడ్డి మాట్లాడుతూ అనేక కొత్త రకం బత్తాయి వంగడాలు వచ్చాయని, రైతులకు ఇవి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయన్నారు. అంతకు ముందు ఆడిటోరియం ఆవరణలో ఏర్పాటు చేసిన స్టాల్లో సిగ్నోవా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉత్పత్తి చేసిన నెమటోజ్ను ఆవిష్కరించారు. అలాగే సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన రైతులు వివిధ రకాల స్టాళ్లను పరిశీలించారు. కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, టీఎస్‌డీడీసీఎఫ్ చైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డి , జాయింట్ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ అధికారి సంగీతలక్ష్మి, డాక్టర్ రాజ గౌడ్ , మేయర్ చైతన్య, కొండా లక్ష్మణా బాపూజీ ఉద్యాన వర్సిటీ వీసీ రాజిరెడ్డి, రైతు కమిషన్ సభ్యుడు రామ్‌రెడ్డి, చెవిటి వెంకన్న, పావనిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ఉద్యానశాఖ రాష్ట్ర , జిల్లా అధికారులు ,అభ్యుదయ రైతులు పాల్గొన్నారు.