నీలగిరి, డిసెంబర్ 29: నల్లగొండలోని ప్రభుత్వ ప్రధాన దవాఖాన ఆవరణలోని పట్టణ నిరాశ్రయుల వసతి కేంద్రాన్ని సోమవారం తెల్లవారు జామున కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మిక తనిఖీ చేశారు. ఉదయం 5 గంటలకే జీజీహెచ్‌కు చేరుకున్న కలెక్టర్ ఎలాంటి ఆశ్రయం లేని వారు నిరాశ్రయుల వసతి కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నిరాశ్రయులకు ఏర్పాటు చేసిన వసతి , డార్మెటరీలు, మంచాలు, దుప్పట్లు తదితర వసతులను పరిశీలించి..వసతి కేంద్రంలో ఉన్న వారితో మాట్లాడారు. నిరాశ్రయులు, ఫుట్‌పాత్‌లపై పడుకునేవారు చలి తీవ్రతకు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వ ప్రధాన దవాఖానలోని వసతి కేంద్రాన్ని ఉపయోగించుకోవాలన్నారు. నిరాశ్రయులు వసతి కేంద్రాన్ని వినియోగించుకునేలా అవగాహన కల్పించాలన్నారు.
ఇందుకోసం పట్టణంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని నల్గొండ ఆర్డీవో అశోక్ రెడ్డిని, మున్సిపల్ కమిషనర్ ఆదేశించారు. గడిచిన రెండు, మూడేళ్లుగా నల్గొండ ప్రభుత్వ దవాఖానలో నిరాశ్రయుల వసతి గృహం నిర్వహిస్తున్నారని, దీన్ని వినియోగించుకోవాలనుకునే వారు ఆధార్, చిరునామా, ఫోన్ నంబర్ ఇవ్వాలన్నారు. ప్రస్తుతం ఈ కేంద్రంలో 17 మంది ఉన్నారని, 60 మందికి వసతి కల్పించేలా ఇకడ అవకాశం ఉందని, మహిళ లు, పురుషులకు వేర్వేరు ఏర్పాట్లు ఉన్నాయని, టాయిలెట్లు తదితర వసతులు ఉన్నాయని తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడి దవాఖానలో చికిత్స పొందుతున్న వారి సహాయకులు, అత్యవసర చికిత్స నిమిత్తం వచ్చే వారి సహాయకులు ఈ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
వసతి గృహంలో ఉన్న వారికి వివిధ ఎన్జీవోలు భోజన వసతి కల్పిస్తున్నాయని తెలిపారు.నిరాశ్రయుల వసతి గృహంలో ఉండే వారు ఎవరైనా జ్వరం, ఇతర వ్యాధులతో బాధపడుతున్నట్లయితే వైద్య చికిత్స అందించాలని జీజీహెచ్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నగేష్‌ను ఆదేశించారు. డాక్టర్లు వారానికి ఒకసారి వసతి కేంద్రాన్ని సందర్శించి వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. సీనియర్ సిటిజన్లు ఉంటే వారికి పెన్షన్‌తో పాటు, ఇతర సౌకర్యాలు కల్పించాలన్నారు. అనంతరం క్యాజువాలిటీతో పాటు, క్యాంటీన్ , నిర్మాణంలో ఉన్న పీజీ హాస్టల్‌ను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ ఎన్జీ కళాశా ల వద్ద ఉన్న వీధి వ్యాపారుల షెల్టర్లలో ర్యాకులు ఏర్పా టు చేసి వినియోగించని దుస్తులు, చెప్పులు,బూట్ల వంటివి అవసరమైన వారు వినియోగించుకునేలా ఒక కేంద్రం ఏర్పాటు చేయాలని ఆర్డీవోతో పాటు, మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. అమె వెంట ఆర్డీవో తో పాటు మున్సిపల్ కమిషనర్ ముసాబ్ అహ్మద్, జీజీహెచ్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నగేష్, తాసీల్దార్ పరశురాం తదితరులు ఉన్నారు.