కొనుగోళ్లు పట్టవు.. రైతుగోడూ పట్టదు
జిల్లాలో ధాన్యం కొనుగోళ్లపై ఆది నుంచి ప్రభుత్వ పెద్దల పర్యవేక్షణ కొరవడిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి నల్లగొండలో ఒక్కసారి కూడా యాసంగి సీజన్లో ధాన్యం కొనుగోళ్లపై జిల్లా మంత్రులు సమీక్ష చేసిన దాఖలాలు లేవు. పూర్తిగా అధికారులకే వదిలేయడంతో అనుకున్న ఫలితం రావడంలేదు. దీంతో ఈ సీజన్లో ధాన్యం కొనుగోళ్ల సమస్య రోజు రోజుకు జఠిలమవుతోంది.
- కొనుగోళ్లపై మంత్రుల పర్యవేక్షణ కరువు
- ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న మిల్లర్లు, ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్లు
- కాంట్రాక్టర్లు పంపితేనే లారీలు
- కొనుగోళ్ల తీరుపై విసిగిపోయిన రైతులు
- ఎట్టకేలకు నేడు కొనుగోలు కేంద్రాలకు మంత్రుల బృందం రాక
- వారి రాకతోనైనా కొనుగోళ్లు గాడిలో పడేనా!
నల్లగొండ ప్రతినిధి, మే13 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో ధాన్యం కొనుగోళ్లపై ఆది నుంచి ప్రభుత్వ పెద్దల పర్యవేక్షణ కొరవడిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి నల్లగొండలో ఒక్కసారి కూడా యాసంగి సీజన్లో ధాన్యం కొనుగోళ్లపై జిల్లా మంత్రులు సమీక్ష చేసిన దాఖలాలు లేవు. పూర్తిగా అధికారులకే వదిలేయడంతో అనుకున్న ఫలితం రావడంలేదు. దీంతో ఈ సీజన్లో ధాన్యం కొనుగోళ్ల సమస్య రోజు రోజుకు జఠిలమవుతోంది. మం త్రులు, ఎమ్మెల్యేల పర్యవేక్షణ కొరవడటంతో కొనుగోళ్లలో కీలకంగా ఉన్న కేంద్రం నిర్వాహకులు, మిల్లర్లు, ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్లదే ఇష్టారాజ్యమైంది. వారు వేసిందే కాంటా… చెప్పిందే తూకం… పంపిందే లారీ అన్నట్లుగా సాగుతోంది. జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ల స్థాయిలో ఎన్నిసార్లు సమీక్షలు చేసినా బేఖాతర్ చేస్తున్న పరిస్థితి. ఫలితంగా ఆరుగాలం కష్టించి పడించిన ధాన్యాన్ని కేంద్రాల్లో పోసి వారాల తరబడి ఎదరుచూస్తున్న రైతులు ఎట్లనో అట్ల తన పంటను అమ్ముకుంటే అదే చాలన్నట్లుగా ఉన్నారు.
ఇదే అదునుగా రైతు కష్టాన్ని దోచుకునేందుకు సెంటర్ నిర్వాహకులు, మిల్లర్లు, ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్లు ఎవరికీ వారే పోటీ పడుతున్నారు. ఫలితంగా ఒక్కో క్వింటాలు ధాన్యంపై రైతు కనీసం 10 శాతం నష్టపోతున్నాడు. ఉమ్మడి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సివిల్ సప్లయీస్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మరో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి యాసంగి కొనుగోళ్లపై జిల్లా స్థాయిలో కనీసం సమీక్ష కూడా చేయలేదు. ప్రారంభంలో కొనుగోలు కేంద్రాల ప్రారంభమంటూ రిబ్బన్ కట్ చేసి వెళ్లారు. ఇక అంతే సంగతులు. గత నెలన్నర రోజులుగా ధాన్యం కొనుగోళ్లు అస్తవ్యస్తంగా మారి మీడియాలో సైతం వరుస కథనాలు వస్తున్నా పట్టించుకోవడంలేదు.
జిల్లా అధికారులు వారి స్థాయిలో ఎంత కృషి చేసినా కొనుగోళ్లు గాడిలో పడటం లేదు. రైసు మిల్లర్లు, ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్లపై మంత్రులు, ఎమ్మెల్యేల పర్యవేక్షణ లేకపోవడంతో వారు అధికారుల ఆదేశాలను పెడచెవిన పెడుతున్నారు. పైగా తమకు ప్రభుత్వ పెద్దలతో ఉన్న సాన్నిహిత్యం పేరుతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో రోజుల తరబడి ఎక్కడి ధాన్యం అక్కడే అన్న చందంగా మారింది. ప్రభుత్వం తీరుపై రైతులు నిత్యం రోడ్డెక్కుతున్నారు. ఏకంగా తమ చేతులతో పండించిన బంగారం లాంటి ధాన్యాన్ని తగులబెట్టి ఆగ్రహం వ్యక్తం చేసే దారుణ పరిస్థితులు దాపురించాయి.
వారిదే ఇష్టారాజ్యం..
ధాన్యం కొనుగోళ్లలో సెంటర్ నిర్వాహకులతో పాటు రైసు మిల్లర్లు, ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్లది కీలకపాత్ర . ధాన్యం దిగుమతిలో కీలకమైన రైసుమిల్లర్లు ధాన్యం దించుకునేందుకు మొదటి నుంచే సతాయిస్తున్నారు. తాలు పేరు తో దించుకోబోమంటూ రోజుల తరబడి లారీలను మిల్లులోనే ఆపేస్తున్నారు. రైతులు వచ్చి తాలు పేరుతో తరుగుకు అంగీకరిస్తేనే దిగుమ తి చేసుకుంటున్నారు. ఇలా ఒక్కో క్వింటాల్‌కు నాలుగైదు కిలోలు తరుగు తీస్తున్నారు. ఈ సమస్యకు పరిష్కారమంటూ అధికారుల ముందే కేంద్రాల్లోనే అదనంగా బస్తాకు కేజీన్నర నుంచి ఆపైనే అదనంగా తూకం వేస్తున్నారు.
అయినా మిల్లు వద్దకు వెళ్లే సరికి మరోసారి తరుగు అంటూ క్వింటాల్‌కు కొన్నిచోట్ల పది కిలోల వరకు ధాన్యం దోచేస్తున్నారు. ఇక ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్లు లారీలు దిగుమతి కావడం లేదన్న సాకుతో ఒప్పందం ప్రకారం సరఫరా చేయాల్సిన వాహనాల్లో సగమే పం పుతున్నారు. దీంతో కాంటా అయ్యాక కూడా లారీలు రాకపోవడంతో కేంద్రాల్లో ధాన్యం వారాల కొద్దీ పేరుకుపోతున్నది. ఇదే అదునుగా ఒక్కో బస్తాకు రూ.3 నుంచి రూ.10 వరకు ట్రాన్స్‌పోర్టు వాళ్లు రైతుల వద్ద నుంచి వసూలు చేస్తున్నారు. ఇలా డబ్బులు ఇవ్వని కేంద్రాలకు లారీలను పంపడం లేదు. కట్టంగూరు మండలం ఈదూలూరులోని కొనుగో లు కేంద్రంలో ఒక్కో బస్తాకు రూ.10 వరకు ఇవ్వడంతో అక్కడికి వెంటవెంటనే లారీలను పంపారు. కానీ అదే మండలంలోని ఇతర కేం ద్రాలకు మాత్రం లారీలు పంపడం లేదు. ఇక లారీల కోసం అధికారులు ఎన్నిసార్లు కాంట్రాక్టర్లపై ఒత్తిడి తెచ్చినా పట్టించుకోవడం లేదు.
ఇక పీఏసీఎస్ కేంద్రాల్లోని కొంతభాగం, హాకా పర్యవేక్షణలోని కేంద్రాల్లో మెజార్టీ కేంద్రాలను అధికారపార్టీ నేతలే నిర్వహిస్తున్నారు. ఇక్కడ వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ… కాంటా ల్లో అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇటీవల సీపీఎం బృందం నల్లగొండ పక్కనే ఉన్న ఎస్ఎల్బీసీ కేంద్రంలో ఏకంగా తూకం మిషన్‌లోనే 200 గ్రాములు తక్కువ చేసి కాంటా వేస్తున్నట్లు గుర్తించింది. ఇక తాలు, తరుగు పేరుతో వాళ్లు చెప్పినంత ధాన్యాన్ని లెక్కిస్తున్నారు. కొన్నిచోట్ల రైతులకు చెప్పకుండానే ఏ గ్రేడ్ ధాన్యాన్ని మిల్లు వద్దకు వెళ్లగా బీ గ్రేడ్‌గా లెక్కిస్తూ ట్రక్ షీట్స్ జారీ చేస్తున్నారు. తాలు పేరుతో తరుగు తీస్తూనే, మళ్లీ బీ గ్రేడ్ ధాన్యమంటూ మోసం చేస్తున్నారు.
క్షేత్రస్థాయికి మంత్రుల బృందం..
ధాన్యం కొనుగోళ్ల అస్తవ్యస్థంగా మారి నిత్యం రైతులు రోడ్లెక్కుతుంటే తప్పనిసరి పరిస్థితుల్లో మంత్రులు దిగిరాక తప్పలేదు. ఇప్పటి వరకు ఒక్కసారైన సమీక్ష చేయని మంత్రులు రైతుల ఆగ్రహాన్ని గుర్తించి గురువారం నల్లగొండ జిల్లాలోని కేంద్రాల పరిశీలనకు వస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఉమ్మడి జిల్లా అధికారులతో సమీక్ష చేయనున్నారు. జిల్లా మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డితో పాటు ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కూడా రానున్నారు. వీరి సమీక్షతోనైనా కొనుగోళ్లు గాడిన పడతాయన్న ఆశలు రైతుల్లో నెలకొన్నాయి. సమీక్షలో పరిస్థితికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలకు దిగితేనే మిల్లర్లు, కాంట్రాక్టర్లు, నిర్వాహకులు, సంబంధిత అధికారుల వైఖరిలో మార్పు వచ్చి రైతులకు న్యాయం జరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధికారులు, మిల్లర్ల మధ్య రైతులు నలిగిపోతున్నారు.
కొన్ని కేంద్రాలను బుధవారం నమస్తే తెలంగాణ బృందం పరిశీలించగా విస్తు గోలిపే విషయాలు వెలుగు చూశాయి
క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇలా..
- చందంపేట మండలం తిమ్మాపూర్ సొసైటీ పరిధిలోని కొనుగోలు కేంద్రంలో 15 రోజుల నుంచి లారీలు రాక ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయి. పోలేపల్లి, చింత్రియాల కేంద్రాల్లోనూ 10 రోజులుగా ఇదే పరిస్థితి.
- కట్టంగూరు మండలం మునుకుంట్ల ఐకేపీ కేంద్రంలో 164 మంది రైతులు ధాన్యం తెస్తే కేవలం 22 మంది ధాన్యం మాత్రమే కాంటా అయ్యింది. వారానికి ఒక్క లారీనే వస్తోంది. మిల్లు వద్దకు వెళ్లిన లారీ నాలుగైదు రోజులు ఆగుతుంది. ఇక్కడ ఇంకా 30 లారీల ధాన్యం కాంటాకు సిద్ధంగా ఉంది. ఐదు కిలోల వరకు తరుగు తీస్తున్నారు.
- శాలిగౌరారం మండలం అడ్లూర్లోని పీఏసీఎస్ కేంద్రంలో బస్తాకు 40.700 కేజీలకు గానూ 42.200 కేజీల తూకం వేస్తున్నారు. కొందరు రైతులకు సమాచారం ఇవ్వకుండానే బీ గ్రేడ్‌గా రాసేస్తున్నారు. లారీల సమస్యతోనే ధాన్యం పేరుకుపోయింది.
- నార్కట్‌పల్లి మండలం తొండ్లాయి ఐకేపీ కేంద్రంలో 112 మంది రైతులు ధాన్యం తేస్తే 42 మందివే కాంటా వేశారు. 35 లారీల ధాన్యం కాంటాకు సిద్ధంగా ఉంది. మూడు రోజుల నుంచి లారీల కోసం వేచిచూస్తున్నారు. వెళ్లిన లారీ దిగుమతికి నాలుగు రోజుల సమయం పడుతున్నది. ఇక్కడ కూడా 40.700కేజీలకు 42.200 కేజీలుగా తూకం వేస్తున్నారు.
- కేతేపల్లి మండలం ఇనుపాముల పీఏసీఎస్ కేంద్రంలో 40 లారీల ధాన్యం పేరుకుపోయింది. ఐదు రోజులకో లారీ వస్తోంది. క్వింటాల్‌కు నాలుగు కిలోల తరుగు తీస్తున్నారు. మిల్లు వద్ద దిగుమతికి ఐదు రోజుల సమయం పడుతోంది.
- చండూరు మండలం పుల్లెంల ఐకేపీ కేంద్రంలో 245 మంది రైతులు ధాన్యం తెస్తే 70 మంది ధాన్యమే కాంటా అయ్యింది. ఇంకా 20 లారీల ధాన్యం నిల్వ ఉంది. రెండురోజుల నుంచి లారీల కోసం ఎదురుచూపులు.
- కొండమల్లేపల్లిలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో 4 కేంద్రాలు ఉండగా 86 లారీల ధాన్యం లోడింగ్ కాగా ఇంకా 100 లారీల ధాన్యం కాంటాకు సిద్ధంగా ఉంది. పది రోజుల నుంచి లారీలు రాకపోవడంతో కాంటాలు నిలిచిపోయాయి. మిల్లుల్లో లారీల అన్‌లోడింగ్‌కు వారం రోజులు పడుతోంది. క్వింటాల్‌కు ఐదు కిలోల తరుగు తీస్తున్నారు.
- గుర్రంపోడు మండలంలో 17వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయగా ఇంకా 14వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కేంద్రాల్లో ఉంది. లారీలు నాలుగైదు రోజులకు ఒకటి చొప్పున వస్తోంది. మిల్లు వద్ద మూడునాలుగు రోజులు పడుతోంది. క్వింటాల్‌కు ఆరు కేజీల తరుగు.
- నాంపల్లిలో 14వేల క్వింటాళ్లకు కాంటా వేస్తే కేవలం 4వేల ధాన్యం మాత్రమే మిల్లులకు వెళ్లింది. 15 రోజుల నుంచి లారీలు రావడం లేదు. లారీల సమస్య తీవ్రంగా ఉంది.
- పీఏ పల్లిలో లారీల కొరతతో ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయి. 80 లారీల ధాన్యం సిద్ధంగా ఉంది. 46వేల క్వింటాళ్ల ధాన్యం వస్తే 21వేల క్వింటాళ్లు కాంటా అయ్యింది. ఇంకో 25వేల క్వింటాళ్లు ఎదురుచూస్తోంది.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

