Tenth Get Together | యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం కోటమర్తి గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 1995-96 బ్యాచ్‌కు చెందిన పదో తరగతి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా గురువులను ఆత్మీయంగా ఆహ్వానిస్తూ వేదిక వద్దకు తీసుకెళ్లారు. గురువులు వేదికను అలంకరించిన అనంతరం.. పూర్వ విద్యార్థులందరూ తమకు తాము పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఒక్కొక్కరు నాటి జ్ఞాపకాలను నెమరేసుకున్నారు.
ఆ తర్వాత గురువులు మాట్లాడుతూ.. ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడంతో పాటు తమను ఆహ్వానించినందుకు పూర్వవిద్యార్థులందరికీ అభినందనలు తెలిపారు. మీరంతా మీ వృత్తులు, రంగాల్లో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించి ఆశీర్వదించారు. నాటి ప్రధానోపాధ్యాయుడు నర్సయ్య సార్ మాట్లాడుతూ.. మీరు ఎక్కడుతన్నా, ఏ వృత్తిలో ఉన్నా, ఏ ఉద్యోగాల్లో ఉన్నా తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని సూచించారు. తల్లిదండ్రులను మంచిగా చూసుకోకపోతే ఎంత ఎత్తుకు ఎదిగినా వృధా అని ఆయన అన్నారు.
మిగతా ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. నీతి నిజాయితీని నమ్ముకుని బతకాలన్నారు. కన్నవాళ్లు కంటతడి పెట్టే పరిస్థితిని తీసుకురావొద్దన్నారు. వీలైతే ఈ బ్యాచ్ విద్యార్థులంతా కలిసి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి పేద విద్యార్థుల చదువులకు తోడ్పాటును అందించాలని కోరారు. మీ అందర్నీ చూస్తుంటే గర్వంగా ఉందని, విద్యార్థులు ఉన్నత స్థానాలను అధిరోహిస్తే సంతోషపడేది మొదట గురువులే అని పేర్కొన్నారు. క్రమశిక్షణలో కోటమర్తి స్కూల్ నంబర్ వన్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ అలరించాయి.