సూర్యాపేట, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ)/తిరుమలగిరి/అర్వపల్లి, ఆగస్టు 22 : రుణమాఫీ చేస్తామని నమ్మించి ఎన్నికల్లో రైతన్నల ఓట్లు వేయించుకుని లబ్ధి పొందిన కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అన్నదాతపై కన్నెర్ర చేస్తున్నది. ఆగస్టు 15 నాటికి షరతుల్లేకుండా 2లక్షల రుణం మాఫీ చేస్తామని కొర్రీల మీద కొర్రీలు పెట్టి సగం మందికి కూడా మాఫీ చెయ్యకపోగా కనీసం కారణం కూడా చెప్పని దుస్థితి.
ఇలాంటి పరిస్థితుల్లో బ్యాంకుల చుట్టూ, వ్యవసాయాధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకునేవారు లేక విసుగెత్తి పోతున్న బాధిత రైతాంగం పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిలబడింది. రుణమాఫీ రాని రైతులతో కలిసి గురువారం ధర్నాలకు దిగింది. అది తట్టుకోలేకపోయిన కాంగ్రెస్ తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో బీఆర్ఎస్ రైతు ధర్నా శిబిరంపై మూకదాడికి దిగింది.
రుణమాఫీ డిమాండ్‌తో మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్‌తోపాటు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, రైతులు తెలంగాణ చౌరస్తాలో శాంతియుతంగా ధర్నా చేస్తుండగా.. కాంగ్రెస్ శ్రేణులు ఒక్కసారి కర్రలు, రాళ్లు, కోడిగుడ్లతో మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. టెంట్లు కూల్చి కుర్చీలు ధ్వంసం చేశారు. బీఆర్ఎస్ నాయకులను గాయపర్చారు. కారు అద్దాలను ధ్వంసం చేశారు.
అక్కడే ఉన్న పోలీసులు కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడంతో గంటపాటు వారు బీభత్సం సృష్టించారు. ప్రయాణికులు, ప్రజలు సైతం తీవ్ర భయాందోళనకు గురయ్యారు. బస్సుల్లో వెళ్తున్న వారిపైనా కాంగ్రెస్ శ్రేణులు రాళ్లు రువ్వడం గమనార్హం. కొంత సమయానికి గానీ పోలీసులు పరిస్థితిని చక్కదిద్దలేదు.
కావాలనే కాంగ్రెస్ గొడవ
రుణమాఫీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు తిరుమలగిరి తెలంగాణ చౌరస్తాలో ఆ పార్టీ శ్రేణులు, రైతులతో కలిసి ధర్నా చేపట్టారు. అదే సమయంలో కాంగ్రెస్ శ్రేణులు కావాలనే ఘర్షణకు సిద్ధమయ్యాయి. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా రుణమాఫీ చేసిన సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం అంటూ అక్కడే కార్యక్రమం నిర్వహించారు. అదే అదునుగా ధర్నా శిబిరంపై దాడులకు దిగారు. బీఆర్ఎస్ ధర్నా శిబిరం కొనసాగుతున్న సమయంలో అదే ప్రదేశంలో పోలీసులు కాంగ్రెస్ శ్రేణుల కార్యక్రమానికి ఎలా అనుమతి ఇచ్చారని పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ శాంతియుత ధర్నాను విచ్ఛిన్నం చేసేందుకు కాంగ్రెస్ కుట్రపూరితంగా దాడికి దిగినట్లు స్పష్టమవుతున్నదంటున్నారు.
గాయపడిన వారిని పరామర్శించిన మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి
కాంగ్రెస్ దాడిలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన తిరుమలగిరి మండలం తాటిపాముల గ్రామానికి చెందిన పెరుమాళ్ల రాజేశ్‌కు ఛాతి, ఎడవ చేయికి బలంగా గాయాలయ్యాయి. తుంగతుర్తి మండలం బండరామారం గ్రామానికి పొదిల అంజయ్య, శాలిగౌరారం మండలం వంగమర్తికి చెందిన శంకర్‌కు దెబ్బలు తగిలాయి. వారికి స్థానిక ప్రైవేట్ దవాఖానలో వైద్యం అందిస్తున్నారు. మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ వారిని పరామర్శించారు.
జగదీశ్‌రెడ్డిని అడ్డుకున్న పోలీసులు
గాయపడిన బీఆర్ఎస్ నాయకులను పరామర్శించడానికి సూర్యాపేట నుంచి తిరుమలగిరికి బయల్దేరిన మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ కారును అర్వపల్లి మండలం తిమ్మాపురం స్టేజీ వద్ద డీఎస్పీ రవి ఆధ్వర్యంలో పోలీసులు అడ్డుకున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలను పరామర్శించి వారిలో మనో ధైర్యం నింపడానికి వెళ్తున్నానని జగదీశ్‌రెడ్డి చెప్పినా వినకుండా నిలువరించారు. దాంతో చట్టానికి మించి అతీతంగా పోలీసులు పని చేస్తున్నట్లుగా ఉందని, తాము కూడా 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నామని, అది మర్చిపోవద్దని, ఇలా అడ్డుకోవడం మంచి పద్ధతి కాదని గుంటకండ్ల హెచ్చరించారు. దాదాపు 15నిమిషాల పాటు జనగాం-సూర్యాపేట ఎన్‌హెచ్ 365బీ జాతీయ రహదారిపై జగదీశ్‌రెడ్డి వాహనంలోనే ఉన్నారు. అనంతరం తిరుమలగిరికి చేరుకున్నారు. డీఎస్పీ వెంట విధుల్లో సూర్యాపేట రూరల్ సీఐ సురెందర్‌రెడ్డి, అర్వపల్లి ఎస్ఐ బాలకృష్ణ, మోతె ఎస్ఐ యాదవరెడ్డి ఉన్నారు.
బీఆర్ఎస్ పాలనలో ఇలాంటి దాడులున్నాయా ? : మాజీ ఎమ్మెల్యే కిశోర్
కాంగ్రెస్ మాదిరి బీఆర్ఎస్ చిల్లర రాజకీయం చేయదని మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అన్నారు. రైతుల సంక్షేమం కోసం పోరాటం చేస్తామని తెలిపారు. పది సంవత్సరాలు పాలించిన తాము ఇలాంటి దాడులు చేస్తే ఒక్కరు కూడా మిగిలేవారు కాదన్నారు. రైతు రుణమాఫీపై మంత్రులకే స్పష్టత లేదని, ఒక్కొక్కరు ఒక రకంగా మాట్లాడుతున్నారని, రైతాంగాన్ని మోసం చేస్తామంటే ఊరుకునేది లేదని చెప్పారు. కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చీరేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం రుణమాఫీపై స్పష్టత ఇవ్వాలన్నారు.