భువనగిరి అర్బన్, అక్టోబర్ 13 : భువనగిరి పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో శుక్రవారం 9వ రాష్ట్రస్థాయి జోనల్ స్పోర్ట్స్ మీట్ అట్టహాసంగా ప్రారంభమైంది. యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, నల్లగొండ, జనగాం జిల్లాలకు చెందిన 13 గురుకుల పాఠశాలల క్రీడాకారులు 1,105 మంది హాజరయ్యారు. వాలీబాల్, కబడ్డీ, లాంగ్‌జంప్, హై జంప్, షార్ట్‌పుట్, అథ్లెటిక్స్, రన్నింగ్, ఖో ఖో పోటీలు జరుగనుండగా తొలిరోజు డీసీపీ రాజేశ్చంద్ర, జడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, గురుకుల విద్యాలయాల అధికారి రజిని ప్రారంభించారు. ఈ నెల 16 వరకు పోటీలు కొనసాగనుండగా విజేతలను రాష్ట్రస్థాయికి ఎంపిక చేయనున్నారు.
భువనగిరి అర్బన్, అక్టోబర్ 13 : 2023- 2024కు సంబంధించి 9వ జోనల్ స్పోర్ట్స్ మీట్లో భాగంగా భువనగిరి పట్టణ పరిధిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో నిర్వహించిన క్రీడా పోటీలను డీసీపీ రాజేశ్చంద్ర, జడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఉమ్మడి జిల్లాల ప్రాంతీయ సమన్వయాధికారి రజిని ప్రారంభించారు. జాతీయ, ఒలంపిక్స్, సొసైటీ జెండాలను ఓవరాల్ ఇన్చార్జి శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంకటేశ్ ఎగురవేశారు. ముందుగా వివిధ కళాశాల నుంచి వచ్చిన క్రీడాకారులు మార్చ్ ఫాస్ట్‌ను ఘనంగా నిర్వహించారు. భువనగిరి విద్యార్థుల యోగా ప్రదర్శన ఆకట్టుకుంది. పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైన డీసీపీ రాజేశ్చంద్ర మాట్లాడుతూ క్రీడా పోటీలను స్ఫూర్తిగా తీసుకొని, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలన్నారు. జడ్పీ సీఈఓ సీహెచ్.కృష్ణారెడ్డి మాట్లాడుతూ మనము శారీరకంగా, మానసికంగా బలపడాలంటే క్రీడలు చాలా ఉపయోగపడతాయన్నారు. ఆర్సీఓ ఎన్.రజిని మాట్లాడుతూ నిరంతర సాధనతోనే విద్యార్థుల్లో అన్ని రంగాల్లో రాణించవచ్చని సూచించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శ్రీరామ్ శ్రీనివాస్, కోచ్‌లు మధు నాయక్ పాల్గొన్నారు.
మొదటి రోజు 5వేల మీటర్స్ అండర్-17 కేటగిరీలో మిర్యాలగూడకు చెందిన ప్రథమ స్థానం బి.గోపీచంద్, నకిరేకల్‌కు చెందిన ఎం.సర్దార్ ద్వితీయస్థానం, స్టేషన్ఘనపూర్ చెందిన ఎం.శ్రీశా ంత్ తృతీయ స్థానంలో నిలిచారు.అండర్-19 విభాగంలో రాజాపేటకు చెందిన ఎల్.గోపీచంద్, ప్రథమ స్థానం, తిప్పర్తికి చెందిన ఎ.వంశీ ద్వితీయ స్థానం, అనుములకు చెందిన బుచ్చిబాబు తృతీయ స్థానాన్ని సాధించారు.
శుక్రవారం నుంచి ఈ నెల 16వరకు 9వ జోనల్ లెవల్ క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీలకు యాదాద్రి భువనగిరి, జనగాం, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల పరిధిలోని 13 సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలల క్రీడాకారులు ఒక్కో పాఠశాల నుంచి 85మంది చొప్పున మొత్తం 1105మంది హాజరయ్యారు. పాల్గొన్న క్రీడా కారులకు వాలీబాల్, కబడ్డీ, లాంగ్‌జంప్, హై జంప్, షార్ట్‌పుట్, అథ్లెటిక్స్, రన్నింగ్, ఖోఖో పోటీలను నిర్వహిస్తారు. విజేతలను ఆయా జట్లుగా ఏర్పాటు చేసి రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపిక చేయనున్నారు.