నల్లగొండ విద్యా విభాగం (రామగిరి) మే 20 : స్నేహపూర్వక వాతావరణంలో బోధనాభ్యాసన ప్రక్రియ జరిగినప్పుడే విద్యార్థుల్లోని సృజనాత్మక శక్తులు వెలికి తీయవచ్చునని, ఆ దిశగా ఉపాధ్యాయులు నిరంతరం సబ్జెక్టులో వచ్చే నూతన మార్పులకు అనుగుణంగా మెలుకులు నేర్చుకోవాలని తెలుగు విశ్రాంత ఉపాధ్యాయుడు, కవి, రచయిత డాక్టర్ చింతాజు మల్లికార్జున చారి, విశ్రాంత ఉపాధ్యాయుడు ఎన్.రఘురామరాజు, రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు అధ్యాపకుడు డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య అన్నారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఉపాధ్యాయులకు మంగళవారం నుంచి ఈ నెల 24 వరకు నిర్వహించే వృత్యాంతర శిక్షణ కార్యక్రమానికి వారు హాజరై మాట్లాడారు.
ఉపాధ్యాయుడు నిరంతర విద్యార్థిగా అధ్యయనం చేయాలన్నారు. రసాస్వాదన కలిగించే విధంగా భాషా బోధన చేసినప్పుడే విద్యార్థులు ఆసక్తికరంగా నేర్చుకుంటారన్నారు. నేటి ఆధునిక కాలంలో డిజిటల్ అంశాలతో కూడిన బోధన సాగుతుందని, దానికి సంబంధించిన బోధనలను సమకూర్చుకొని విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధించాలని సూచించారు. విద్యార్థి సామర్థ్యానికి అనుగుణంగా బోధన సాగినప్పుడే వారిలో భాష పై పట్టు సాధించే అవకాశం ఉంటుందన్నారు. అదేవిధంగా ఉద్యోగ ప్రస్థానంలో తమ జీవిత అనుభవాలను, తెలుగు భాషా బోధనలో మెలకువలను తెలియజేశారు.
కోర్సు డైరెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి బొల్లారం భిక్షపతి మాట్లాడుతూ.. తెలుగు సబ్జెక్టులో అనుభవజ్ఞుడైన సీనియర్స్ సూచనలు సలహాలను బోధనా ప్రక్రియను సాగించేందుకు స్ఫూర్తిగా తీసుకోవాలని తెలిపారు. ఉపాధ్యాయులు నిరంతరం విద్యార్థులుగా ఉంటూ మారుతున్న కాలానికి అనుగుణంగా బోధన నైపుణ్యాలు పెంచుకొని విద్యార్థులకు అందించాలని తెలిపారు. డిజిటల్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంశాలను సైతం బోధనలో ఉపయోగించి నూతన వరవడిని తీసుకురావాలని కోరారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కార్పొరేట్ ప్రైవేటు దీటుగా సిద్ధం చేసి ఉత్తమ ఫలితాలు సాధించేలా చూడాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు. అనంతరం వారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ సమగ్ర శిక్ష సెక్టోరియల్ ఆఫీసర్ ఆర్. రామచంద్రయ్య, సబ్జెక్టు ఇన్చార్జి విజయలక్ష్మి, రీసెర్చ్ పర్సన్స్ డాక్టర్ సాగర్ల సత్తయ్య, డాక్టర్ కనకటి రామకృష్ణ, కొప్పుల యాదయ్య, మద్దోజు సుధీర్ బాబు, గ్యార నరసింహ, పొడిచేటి శంకర్, కె.కిషన్ పాల్గొన్నారు.