సమైక్య పాలనలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న సూర్యాపేట పట్టణం స్వరాష్ట్రంలో సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంటున్నది. మెరుగైన రోడ్లు, విద్యుత్ వ్యవస్థ, పచ్చని పార్కులు, పరిశుభ్రతకు ప్రాధాన్యం, ఇంటింటికీ సురక్షితమైన తాగునీటి సరఫరాతోపాటు అనేక అభివృద్ధి పనులు చేపట్టారు. మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డితో పట్టణం ప్రగతి పథంలో దూసుకెళ్తూ ఆదర్శంగా నిలుస్తున్నది. ఇప్పటికే పదుల సంఖ్యలో అవార్డులు సొంతం చేసుకున్న సూర్యాపేట మున్సిపాలిటీ ఇటీవల తెలంగాణ అవతరణ దశాబ్ది వేడుకల్లో మూడు రాష్ట్ర స్థాయి అవార్డులు దక్కించుకున్నది. పర్యావరణ మిత్ర, మహాప్రస్తానం-ఇంటెగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం, హరితహారం అంశాల్లో ఉత్తమంగా నిలిచింది.
సూర్యాపేట, జూన్ 25 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో సూర్యాపేట మున్సిపాలిటీ ముచ్చటగా మూడు అవార్డులు సొంతం చేసుకుని అరుదైన గౌరవాన్ని పొందింది. పర్యావరణ మిత్ర, మహాప్రస్థానం-ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌తో పాటు రికార్డు స్థాయిలో హరితహారం నిర్వహించినందుకు ఈ అవార్డులు లభించాయి. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి కృషితో తొమ్మిదేళ్లలో సూర్యాపేట సరికొత్త రూపు ను సంతరించున్నది. తాజా అవార్డులతో కలిపి సూర్యాపేట మున్సిపాలిటీ ఇప్పటి వరకు 15 అవార్డులు కైవసం చేసుకున్నది.
ఎంతో ఘన చరిత్ర కలిగిన సూర్యాపేట ఉమ్మడి పాలకుల నిర్వాకంతో చరిత్ర ఆనవాళ్లు కనుమరుగై దశాబ్దాల తరబడి తాగునీరు, రోడ్లు, విద్యుత్ వంటి అనేక సమస్యలతో కొట్టుమిట్టాడింది. రాష్ట్ర ఏర్పాటు ముందు వరకు హైదరాబాద్ మూసీ మురుగు నీటినే తాగునీటిగా పంపించిన ఘనులు నాటి పాలకులు. నాడు పట్టణంలో ఆహ్లాదం కోసం ఓ చిన్న పార్క్ గానీ, పచ్చదనం గానీ మచ్చుకు కూడా లేదు. అలాంటిది 2014 రాష్ట్ర ఏర్పాటు తర్వాత మంత్రి జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో ఎవరూ ఊహించని రీతిలో ప్రతిపక్షాలు సైతం తమ ప్రైవేట్ సంభాషణల్లో మెచ్చుకునేలా అభివృద్ధి చెందింది. తొమ్మిదేళ్ల కాలంలో వేలాది కోట్లు తెచ్చి అన్ని రంగాలను అభివృద్ధి చేస్తుండడంతో జాతీయ స్థాయిలోనూ అవార్డులు వరిస్తున్నాయి.
తొమ్మిదేండ్లు.. 15 అవార్డులు
సూర్యాపేట మున్సిపాలిటీ అభివృద్ధి కోసం వందల కోట్లు తీసుకువస్తున్న మంత్రి జగదీశ్‌రెడ్డి అన్ని రంగాలను సమగ్రాభివృద్ధి చేస్తుండడంతో అవార్డులు వాటంతట అవే వచ్చి వరిస్తున్నాయి. అలా తొమ్మిదేళ్ల కాలంలో 15 అవార్డులు రావడం గమనార్హం. 2017 నుంచి పరిశీలిస్తే జాతీయ స్థాయి స్వచ్ఛ సర్వేక్షణ్, మరోసారి జాతీయ స్థాయిలో 45వ ర్యాంక్, ప్రాపర్టీ ట్యాక్స్ వంద శాతం వసూలుకు రాష్ట్ర స్థాయి అవార్డు, రాష్ట్ర స్థాయి కొవిడ్ వారియర్ అవార్డు, రెండుసార్లు వంద శాతం ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు, పారిశుధ్య నిర్వహణ, కొవిడ్ మూడుసార్లు స్కోచ్ అవార్డులు రాగా 2018లో ఐఎస్ఓ 14,000 అలాగే ఉమ్మడి జిల్లా ఉత్తమ మున్సిపాలిటీ అవార్డులు దక్కాయి. వీటితో పాటు తాజాగా దశాబ్ది వేడుకల్లో సూర్యాపేట మున్సిపాలిటీకి మూడు అవార్డులు రావడం ద్వారా మొత్తం తొమ్మిదేళ్లలో 15 అవార్డులు దక్కాయి. దశాబ్ది వేడుకల్లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో నివారించేందుకు చేస్తున్న కృషికి తెలంగాణ స్టేట్ పొల్యూషన్ బోర్డు పర్యావరణ మిత్ర అవార్డును అందించింది.
అలాగే సూర్యాపేట మున్సిపాలిటీలో నూతనంగా నిర్మించిన మహా ప్రస్థానం, ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్‌వెజ్ నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం అవార్డును ప్రకటించింది. హైదరాబాద్‌లో రాష్ట్ర స్థాయి పట్టణ ప్రగతి సంబురాల్లో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, కమిషనర్ రామానుజులరెడ్డి అవార్డును అందుకున్నారు. అలాగే పట్టణంలో హరితహారం కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తూ పచ్చని పట్టణంగా సూర్యాపేటను తయారు చేసినందుకు గాను మరో రాష్ట్ర స్థాయి అవార్డు వచ్చింది.
సూర్యాపేటలో తలపెట్టిన పట్టణ ప్రకృతి వనాలు, బృహత్ పట్టణ ప్రకృతి వనాలు, ట్రీ పార్కులు, ఎవెన్యూ ప్లాంటేషన్, చిట్టి అడవులను ఏర్పాటు చేసి పట్టణంలో పచ్చదనం పెంపొందించడం, హరితహారంపై ప్రజల్లో విస్త్రత అవగాహన కల్పిస్తూ ప్రతి శుక్రవారం వాటరింగ్ డే, గ్రీన్ డే నిర్వహించి మొక్కలకు నీళ్లు పోస్తూ సంరక్షించడంతో సూర్యాపేట పచ్చని పట్టణంగా మారి హరితహారం రాష్ట్ర స్థాయి అవార్డు వరించింది.