గట్టుప్పల్, జనవరి 03 : ఈ యాసంగి సీజన్ పంటలు సాగు చేయడానికి సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని గట్టుప్పల్ మండల వ్యవసాయ అధికారి మైల రేవతి తెలిపారు. శనివారం మండల కేంద్రంలోని యూరియా నిల్వ కేంద్రాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా మండలంలో వరి సాగు చేస్తున్న రైతుల నుండి వచ్చిన యూరియా సరఫరా డిమాండ్‌కు వ్యవసాయ శాఖ సత్వరంగా స్పందించి, ఎలాంటి అంతరాయం లేకుండా సకాలంలో యూరియా సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఘట్టుప్పల్ మండలంలోని ఎం/ఎస్ ఆగ్రో రైతు సేవా కేంద్రానికి మొత్తం 19.98 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయబడిందన్నారు.
సదరు డీలర్ ఆర్థిక ఇబ్బందుల కారణంగా గత వారం రోజులుగా యూరియా సరఫరా కోసం అవసరమైన చెల్లింపును చేయలేని పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ, రైతుల ప్రయోజనాలను ప్రధానంగా పరిగణనలోకి తీసుకుని యూరియా తెప్పించామన్నారు. యూరియా కొనుగోలు చేసే రైతులు ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకుని సంబంధిత డీలర్‌ను సంప్రదించాలని సూచించారు. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ శాఖ ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ, ఎరువుల సరఫరాలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకుంటుందని ఆమె పేర్కొన్నారు.