కొండమల్లేపల్లి, ఏప్రిల్ 12 : కొండమల్లేపల్లి పట్టణంలో మదర్‌డెయిరీకి చెందిన దుకాణాలను అగ్రిమెంట్ చేసుకున్నది ఒకరైతే.. వ్యాపారాలు మరొకరు నిర్వహిస్తున్నారు. పాలశీతలీకరణ కేంద్రం దుకాణాలను వేలంలో దక్కించుకున్న లీజుదారులు షాపులు ఏర్పాటు చేయకుండా రెట్టింపు ధరకు సబ్ లీజుకు ఇచ్చి ఆదాయం పొందుతున్నారు. ఎక్కువ శాతం మంది నాయకులు, పట్టణ ప్రముఖులు ఈ దుకాణాలను దక్కించుకోవడంతో అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. పదేండ్లకోసారి లీజును పునరుద్ధరించాలి. లేదా అక్రమాలుంటే రద్దు చేయాలి. కానీ.. అధికారులు పట్టించుకోకపోవడంతో ఆదాయం భారీగా తగ్గింది. బయటి మార్కెట్ కంటే చాలా తక్కువ అద్దె ఇస్తుండడంతో పాలశీతలీకరణ కేంద్రానికి నష్టం వాటిల్లుతున్నది.
రెట్టింపు ధరకు సబ్ లీజు
కొండమల్లేపల్లి పట్టణం నడిబొడ్డున హైదరాబాద్ రోడ్డులో పాలశీతలీకరణ కేంద్రం ఆదాయాన్ని పెంచేందుకు 20 ఏండ్ల కిత్రం నాలుగు వాణిజ్య సముదాయాలను ఏర్పాటు చేశారు. బస్టాండ్ ఎదురుగా ఫేజ్ 1లో 29 దుకాణాలు, ఫేజ్ 3లో 15, ఫేజ్ 4లో 22, బస్టాండ్ పక్కన ఫేజ్ 2లో 28 దుకాణాలు.. మొత్తం 94 దుకాణాలను నిర్మించారు. అప్పటి నుంచి ఈ షాపులను లీజుకు ఇస్తున్నారు. దుకాణాలను తక్కువ ధరకు దక్కించుకున్న వారు రెట్టింపు ధరకు సబ్ లీజుకు ఇచ్చి లాభాలు గడిస్తున్నారు. ఒక్కో దుకాణానికి రూ.3వేల నుంచి రూ.7500 వరకు పాలశీతలీకరణ కేంద్రానికి అద్దె చెల్లిస్తున్నారు. ఒక్కో దుకాణదారుడు ఫేజ్ 1లో రూ.25వేలు, ఫేజ్ 2లో రూ.50వేలు, ఫేజ్ 3లో రూ.30వేలు, ఫేజ్ 4కు రూ.2లక్షల వరకు అడ్వాన్స్ ఇచ్చారు. ఇప్పుడు అన్ని షాపులకు కలిపి రూ.5లక్షల వరకు నెలకు అద్దె వసూలు అవుతున్నది. వేలంలో మడిగెలు దక్కించుకున్న ఎక్కువ మంది షాపులు పెట్టకుండా ఇతరులకు లీజుకు ఇస్త్తూ రూ.10వేల నుంచి రూ.20వేల వరకు అద్దె పొందుతున్నారు. ఫేజ్ 1లో లీజు దక్కించుకున్న వారు సబ్ లీజుకు రూ.20వేలు తీసుకుని పాలశీతలీకరణ కేంద్రానికి రూ.7,292 మాత్రమే చెల్లిస్తున్నారు. ఫేజ్ 2లో లీజుదారుడు రూ.10వేలకు పైగా తీసుకుని పాలశీతలీకరణ కేంద్రానికి రూ.5వేలు అద్దె చెల్లిస్తున్నాడు. ప్రతి ఏడాది మూడు శాతం అద్దె పెంచుతారు. పదేండ్లకు ఒకసారి లీజు రెన్యూవల్ చేయాలి. లేకుంటే లీజును రద్దు చేసి మళ్లీ వేలం వేసి టెండర్ ద్వారా వేరే వారికి ఇవ్వాలి. కానీ.. దాదాపు 20 ఏండ్లు దాటుతున్నా సబ్ లీజుకు ఇచ్చిన వారిని అధికారులు గుర్తించడంలేదు. సబ్ లీజుకు ఇచ్చి ఎక్కువ అద్దె పొందుతున్న వారి లీజులు రద్దు చేస్తే పాలశీతలీకరణ కేంద్రానికి రెట్టింపు అద్దెలు, అడ్వాన్స్‌లు వస్తాయి.
లీజుకు తీసుకున్న వ్యక్తులు నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ మరొకరికి షాపును ఇస్తే స్వాధీనం చేసుకోవచ్చు. కానీ.. ఆ దిశగా చర్యలు తీసుకోవడంలేదు.
కొండమల్లేపల్లి పట్టణంలో పాలశీతలీకరణ కేంద్రం నిధులతో నిర్మించిన నాలుగు షాపింగ్ కాంప్లెక్స్‌లలో అధిక శాతం దుకాణాలు నాయకులు, పట్టణ ప్రముఖుల చేతుల్లోనే ఉన్నాయి. అందుకే దుకాణాలను సబ్ లీజుకు ఇచ్చినా అధికారులు చర్యలకు వెనుకాడుతున్నారు. రాష్ట్రంలో మదర్ డెయిరీ నష్టాల్లో ఉందని చెబుతున్నారే తప్ప.. కొండమల్లేపల్లిలోని మదర్ డెయిరీ షాపింగ్ కాంప్లెక్స్ ద్వారా ప్రస్తుతం ఏటా రూ.60 లక్షల ఆదాయం వస్తున్నది. సబ్ లీజులను రద్దు చేస్తే ఈ ఆదాయం రెట్టింపు అవుతుంది. పదేండ్లలో దాదాపుగా రూ.12 కోట్ల అద్దెతోపాటు అడ్వాన్స్‌గా కోట్ల రూపాయలు వస్తాయి. ఈ దిశగా కొండమల్లేపల్లి పట్టణ పాలశీతలీకరణ కేంద్రం, రాష్ట్ర మదర్ డెయిరీ అధికారులు ముందడుగు వేస్తే మంచిదని పట్టణ ప్రజలు పేర్కొంటున్నారు. ఈ విషయంపై పాలశీతలీకరణ కేంద్రం మేనేజర్ శ్రీనివాస్‌ను వివరణ కోరగా.. పై అధికారుల అదేశాల మేరకు ప్రస్తుతం జీఎస్టీ సహా అద్దె వసూలు చేస్తున్నామన్నారు. అగ్రిమెంట్ చేసుకున్న వారు మరొకరికి లీజుకు ఇచ్చిన విషయం తమ దృష్టికి రాలేదని, ఎవరైనా ఫిర్యాదు చేస్తే అధికారులకు తెలుపుతామని చెప్పారు.