నీలగిరి, ఫిబ్రవరి 7 : డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని నల్లగొండ ఎస్పీ చందనాదీప్తి హెచ్చరించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్స్ యజమానులతో ఆమె సమావేశం నిర్వహించారు. యువత మత్తులో దించే గంజాయి, ఇతర వస్తువులపై పోలీసుల నిఘా ఎక్కువ కావడంతో మందుల కొనుగోళ్లపై దృష్టి పెట్టినట్లు చెప్పారు. విచ్చలవిడిగా ఫార్మింగ్ డ్రగ్స్ విక్రయిస్తున్నందున యువత మత్తుకు బానిస అవుతున్నారని తెలిపారు. జిల్లా కేంద్రంలో ఇటీవల ఒక మెడికల్ షాప్పై కేసు పెట్టామని, మెడికల్ ప్రిస్రిప్షన్ లేకుండా మత్తు కలిగించే టాబ్లెట్లు, ఇంజెక్షన్లు విక్రయించొద్దని సూచించారు. మెడికల్ షాప్ యజమానులు నారోటిక్ డ్రగ్స్ విక్రయించేందుకు నిబంధనల ప్రకారం లైసెన్స్ ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో డ్రగ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ దాసు, సీఐలు రుద్వీర్ కుమార్, శ్రీను, కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటపతి, చిలుకూరి పరమాత్మ, మెడికల్ షాప్ యజమానులు పాల్గొన్నారు.