మోత్కూరు, మార్చి16 : జిల్లాలో విద్యుత్ కోతలు లేకుండా, లో ఓల్టేజీ సమస్య లేకుండా మెరుగైన విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామని ట్రాన్స్‌కో భువనగిరి డీఈ వెంకటేశ్వర్లు తెలిపారు. ‘రైతన్నకు కరెంట్ కష్టాలు’ శీర్షికన నమస్తే తెలంగాణ జిల్లా పేజీలో ఆదివారం ప్రచురితమైన కథనానికి విద్యుత్ అధికారులు స్పందించారు. జిల్లా ట్రాన్స్‌కో ఎస్ఈ ఆదేశాల మేరకు జిల్లాలోని పలు మండలాల్లో ట్రాన్స్‌కో సిబ్బంది విద్యుత్ సరఫరా తీరుపై క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. జిల్లాలో ఎక్కడ ఏమి పనులు చేశారో భువనగిరి డీఈ వెంకటేశ్వర్లు తెలిపారు. మోత్కూరు మండలం బుజిలాపురం 132/33 కేవీ సబ్ స్టేషన్ పరిధిలోని మోత్కూరు, గుండాల, ఆత్మకూరు(ఎం), అడ్డగూడూరు మండలాల రైతులకు వ్యవసాయానికి లో ఓల్టేజీ లేకుండా మెరుగైన విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకున్నారు. మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని ఇంగీసమ్మకుంట సమీపాన ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌లో ట్రిప్పింగ్ సమస్యను పరిష్కరించారు.
ఆత్మకూరు(ఎం) మండల పరిధిలోని పల్లెర్ల సబ్ స్టేషన్ పరిధిలో లో ఓల్టేజీ సమస్య లేకుండా అదనపు ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేశారు. రాజాపేట మండలంలోని బొందుగుల సబ్‌స్టేషన్‌లో లో ఓల్టేజీ సమస్య లేకుండా 5ఎంఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ స్థానంలో కొత్తగా 8ఎంఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేశారు. అదే విధంగా వేసవి కాలం కావడంతో జిల్లాలో సాంకేతిక సమస్యలు ఉన్న 104 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను గుర్తించి వాటి స్థానంలో 91 త్రీ హెచ్‌పీ కొత్త ట్రాన్స్ఫార్మర్లు, 13 వన్ హెచ్‌పీ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశా రు. వివరించారు. జిల్లాలో ఎక్కడైనా విద్యుత్ సమస్యలు తలెత్తితే 949106 5938 కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించాలని ఎస్ఈ కోరారు.
మునుగోడు : మునుగోడు మండల పరిధిలోని కల్వలపల్లి, సింగారం గ్రామాల్లో లో ఓల్టేజీపై డీఈ అన్నయ్య, ఏడీఈ ఆశోక్‌కుమార్, ఏఈ సురేశ్‌కుమార్ పర్యటించారు. కరెంట్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్లను పరిశీలించారు. ప్రస్తుతం లో ఓల్టేజీ సమస్య లేదని, భూగర్భ జలాలు అడుగంటడంతో నీళ్లు పోయడం లేదని అధికారులు తెలిపారు. వేసవి దృష్ట్యా మెరుగైన విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.