యాదాద్రి భువనగిరి, జూన్ 5 (నమస్తే తెలంగాణ): కొంతకాలంగా కుదేలైన రియల్ ఎస్టేట్‌కు సర్కారు పుండు మీద కారం జల్లినంత పని చేసింది. ఆదాయమే ధ్యేయంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో భూములు, ప్లాట్ల విలువకు రెక్కలొచ్చాయి. భూముల విలువ అమాంతంగా డబుల్, త్రిపుల్ పెరిగిపోయింది. హెచ్ఎండీఏ మండలాల్లో అడ్డగోలుగా పెంచేశారు. ఫలితంగా రిజిస్ట్రేషన్ చార్జీలు సైతం నాలుగైదు రెట్లు ఆకాశన్నంటాయి. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు లబోదిబోమంటున్నారు.
బీబీనగర్‌లో రూ.1.60 కోట్లు
రాష్ట్ర ప్రభుత్వం భూములతో పాటు ప్లాట్ల కొత్త మార్కెట్ విలువ పెంచింది. వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకొని కొత్త ధరలను నిర్ణయించారు. వ్యవసాయ భూములు, హైవేలకు దగ్గరగా ఉన్నవి, ప్లాట్ల అంశాల ప్రకారం రేట్లు పెంచేశారు. ఇప్పటికే భూభారతి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ వెబ్సైట్లో పొందుపర్చారు. కొన్ని చోట్ల వందశాతం, మరికొన్ని చోట్ల వందశాతంలోపు విలువ అధికమైంది. పెంచిన విలువ శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చింది.
భువనగిరిలో గజం విలువ రూ.48,300
భువనగిరిలో గజం భూమి విలువ రూ.48,300 పలుకుతున్నది. అత్యధికంగా ఫిష్ మార్కెట్ నుంచి కృష్ణా జువెల్లర్స్, హన్మకొండ రోడ్డు నుంచి ముస్తఫా చికెన్ సెంటర్, పాత ఎస్బీహెచ్ నుంచి ప్రిన్స్ వరకు, మార్కెట్, జూనియర్ కళాశాల ఎదురుగా గజానికి రూ.48,300 పెంచేశారు. బీబీనగర్ పట్టణంలో రూ.1.01 కోట్లుగా ఉన్న మార్కెట్ విలువను రూ.1.60 కోట్లగా నిర్ణయించారు. బీబీనగర్ మండలంలోని గూడూరు వద్ద రూ.1.50 కోట్లు నిర్ణయించారు. గతంలో ఇక్కడ రూ.71.15 లక్షలు ఉండేది. ఇదే మండలంలోని కొండమడుగులో రూ.60.99 లక్షల నుంచి రూ.1.50 కోట్లకు పెరిగింది. ఇవన్నీ హైదరాబాద్-వరంగల్ హైవేకు ఆనుకొని ఉన్నవే. రేట్లు పెరగడంతో చాలా మంది స్లాట్స్ క్యాన్సిల్ చేసిన పరిస్థితి కనిపించింది.
వెబ్సైట్లలో వివరాలు..
రాష్ట్ర ప్రభుత్వం భూములతో పాటు ప్లాట్ల కొత్త మార్కెట్ విలువ పెంచింది. వివిధ అంశాలను పరిగణలోకి తీసుకొని కొత్త ధరలు నిర్ణయించారు. వ్యవసాయ భూములు, రోడ్డుకు దగ్గరగా ఉన్నవి, డిమాండ్ తక్కువగా ఉన్న అంశాల ప్రకారం రేట్లు పెంచేశారు. పెంచిన విలువ శుక్రవారం నుంచే అమల్లోకి వచ్చాయి. ఇప్పటికే భూభారతి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ వెబ్సైట్లో పొందుపర్చారు. కొన్ని చోట్ల వందశాతం, మరికొన్ని చోట్ల వందశాతం లోపు విలువ అధికమైంది.
కొత్త హెచ్ఎండీఏ మండలాల్లో భారీగా..
యాదాద్రి భువనగిరి జిల్లాలో గతంలో కేవలం భువనగిరి, బీబీనగర్, పోచంపల్లి, చౌటుప్పల్, బొమ్మలరామారం మండలాలు మాత్రమే హెచ్ఎండీఏలో ఉండేవి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక యాదాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసింది. అదే సమయంలో జిల్లాలోని వలిగొండ, సంస్థాన్ నారాయణపురం, రాజాపేట, యాదగిరిగుట్ట మండలాలను హెచ్ఎండీఏలోకి చేర్చారు. ఇప్పుడు ఈ మండలాల్లో అత్యంత భారీగా మార్కెట్ విలువ పెంచేశారు. ఆయా మండలాల్లో గతంలో ఎకరం భూమి విలువ సగటున రూ.2.50 లక్షల నుంచి రూ.4.50 లక్షలు ఉండగా, రిజిస్ట్రేషన్ చార్జీలు రూ.20 వేల లోపే ఉండేవి. ఇప్పుడు సగటున ఎకరానికి రూ.7.50 లక్షల నుంచి రూ.13 లక్షల వరకు పెంచారు. దీంతో స్టాంప్ డ్యూటీ చార్జీలు రూ.లక్ష వరకు భరించాల్సి వస్తోంది. అంటే ఏకంగా నాలుగు రెట్ల స్టాంప్ డ్యూటీ పెరగడం గమనార్హం. ఇవి కాకుండా కమర్షియల్, డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో గణనీయంగా బాదారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో రియల్ ఎస్టేట్ భారీగా పడిపోయింది. కరోనా తర్వాత మార్కెట్ కుదేలైంది. ఒకప్పుడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల కోసం క్యూలు కనిపించేవి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ల సంఖ్య రెండెంకెలకు రావడమే గగనమైంది. రియల్ ఎస్టేట్ దివాళా తీసింది. కొన్న రేటుకు అమ్ముదామన్నా కొనే నాథుడే లేడు. వ్యాపారులు, ఏజెంట్లు అరిగోస పడుతున్నారు. ఇలాంటి సమయంలో భూముల విలువ పెంచడంపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అమ్మేవారికి ఏం కాదని, కొనేటోళ్లకు చుక్కలు కనిపిస్తాయనే చర్చ నడుస్తున్నది. ఇంత పెద్దమొత్తంలో రిజిస్ట్రేషన్ చార్జీలు చెల్లించడం ఇబ్బందికరంగా మారే పరిస్థితి కనిపిస్తున్నది.
భూముల సవరణ ఇలా..
భువనగిరి: గతంలో సగటున భూమి విలువ ఎకరానికి రూ.7.50 లక్షలు ఉండగా ప్రస్తుతం రూ.13 లక్షలకు పెంచారు. నాన్ అగ్రికల్చర్ విషయానికొస్తే.. గతంలో గజం రూ.2,100 ఉండగా ఇప్పుడు రూ.3,200 పెంచారు. గతంలో రిజిస్ట్రేషన్ చార్జీలు 100 గజాలకు రూ.16,800 ఉండగా ఇప్పుడు రూ.25,600లకు ఎగబాకింది.
బీబీనగర్: బీబీనగర్ పట్టణ కేంద్రంలో గతంలో ఎకరానికి భూమి విలువ రూ.20.25 లక్షలు ఉండగా ఇప్పుడు రూ.50.40 లక్షలకు పెరిగింది. అంటే రూ.30.15 లక్షలు అధికం. ఇంతకుముందు ఎకరాకు రూ.1.62 లక్షలు ఉండగా ఇప్పుడు రూ.4.03 లక్షలు అయ్యింది. అంటే ఎకరాకు రూ.2.41 లక్షలు అదనంగా చెల్లించాల్సిందే.
తుర్కపల్లి: మండలంలోని గంధమ్ల, రుస్తాపురం, గోపాలపురం, తుర్కపల్లి గ్రామాల్లో వ్యవసాయ భూముల విలువ ఎకరాకు రూ.11 లక్షలు ఉండగా ప్రస్తుతం రూ.19.63 లక్షలకు పెరిగింది. దత్తాయపల్లిలో సర్వే నంబర్ 93లో ఎకరాకు గతంలో రూ.4.50 లక్షలు ఉండగా ఇప్పుడు రూ.16.65 లక్షలకు పెంచారు.
బొమ్మలరామారం: బొమ్మలరామరం మండల కేంద్రంలోని సర్వే నంబర్ 2, 3, 5లలో గతంలో ఎకరం భూమి విలువ రూ.9 లక్షలు ఉండగా ఇప్పుడు రూ.39 లక్షలు చేశారు. రిజిస్ట్రేషన్ చార్జీలు రూ.3 లక్షలకు పెంచేశారు.
చౌటుప్పల్: మండలంలోని పలు గ్రామాల్లో ఇంతకు ముందు ఎకరానికి రూ.7.50 లక్షలు ఉండగా ప్రస్తుతం రెట్టింపు అయ్యింది. మున్సిపాలిటీలో ఏరియాను బట్టి రూ.10.15 లక్షల నుంచి రూ.13 లక్షలు ఉండగా ప్రస్తుతం రెండింతలైంది. టౌన్లో రోడ్డు పక్కన ఉన్న కమర్షియల్ బిట్టు ఎకరానికి రూ.50.82 లక్షల నుంచి రూ.76.23 లక్షలకు పెంచారు. ప్లాట్ల విషయానికొస్తే కమర్షియల్ హైవే, ఇతర షెటర్ ప్లాట్లకు గతంలో రూ.25 వేలు ఉండగా ప్రస్తుతం రూ.31 వేలకు బాదారు.
సంస్థాన్‌నారాయణపురం: మండలంలో ఎకరాకు రూ.13 లక్షలకుపైగా మార్కెట్ విలువ పెంచారు. జనగాం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 26లో గతంలో ఎకరాకు భూమి విలువ రూ.2.25 లక్షలు ఉండేది. ఇప్పుడు రూ.10 లక్షలకు పెంచడంతో స్టాంప్ డ్యూటీ రూ.80 వేల వరకు చెల్లించాల్సిన పరిస్థితి.
ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ రైతుల ధర్నా
తురపల్లి, జూన్ 5: ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ శుక్రవారం మండలంలోని వాసాలమర్రి సెంటర్ ఎదుట భువనగిరి గజ్వేల్ ప్రధాన రహదారిపై రైతులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ రెండు నెలల క్రితం గ్రామంలో ఏర్పాటు చేసిన కేంద్రంలో ధాన్యం కొనుగోలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. నేటికీ వందకుపైగా ధాన్యం కుప్పలు కనిపిస్తున్నాయని చెప్పారు. ధాన్యం రాశులు పోసి నెలలతరబడి పడిగాపులు కాస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారని చెప్పారు. వర్షాలు పడి ధాన్యం మొలకలొచ్చే పరిస్థితి వచ్చిందన్నారు. అధికారులు కుప్పలను పరిశీలించి ఫొటోలకు ఫోజులు ఇస్తున్నారే తప్ప ధాన్యం తరలింపుపై శ్రద్ధ చూపడం లేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇలాంటి పరిస్థితి చూడలేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వడ్లను వెంటనే మిల్లులకు తరలించి ఆదుకోవాలని రైతులు కోరారు.