త్రిపురారం, జూన్ 25 : కృషి విఙ్ఞాన కేంద్రం అభివృద్ధిలో శ్రీనివాస్ కృషి అభినందనీయమని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త డాక్టర్ ఎన్.లింగయ్య అన్నారు. బుధవారం త్రిపురారం మండలంలోని కంపసాగర్ కేవీకేలో గత మూడు సంవత్సరాలుగా విధులు నిర్వహించి పదోన్నతిపై హైదరాబాద్‌కు వెళ్తున్న ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఎస్.శ్రీనివాస్‌రావు వీడ్కోలు సమావేశంలో ఆయన మాట్లాడారు. గత మూడు సంవత్సరాల నుంచి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా కేవీకే సేవలు అందించడానికి శ్రీనివాస్‌రావు ఎనలేని కృషి చేసినట్లు తెలిపారు.
కొత్త వంగడాలను పరిచయం చేస్తూనే కేవీకే రైతులకు అందించాల్సిన సేవలను అన్ని మండలాల్లో వ్యాప్తి చేయడమే కాకుండా, నికర ఆదాయాన్ని పెంచిన ఘనత శ్రీనివాస్‌రావుకు దక్కుతుందన్నారు. రైతులకు నిత్యం అందుబాటులో ఉంటూ సమగ్ర వ్యవసాయంపై అవగాహన కల్పించడంతో పాటు కేవీకేలో ఏర్పాటు చేసి నిరూపించిన ఘనత శ్రీనివాస్‌దే అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు చంద్రశేఖర్, హిమబిందుతో పాటు జూనియర్ శాస్త్రవేత్తలు, ఆదర్శ రైతులు పాల్గొన్నారు.