ఆ బాలిక పెన్సిల్ వర్క్స్ దిట్ట. ఆక్రిలిక్ కలర్స్‌తో క్యాన్వాస్ పెయింటింగ్‌లో ప్రత్యేక శైలిని కనబర్చుతూ ఔరా అనిపించుకుంటున్నది. ఓ వైపు చదువుకుంటూనే మరో వైపు సామాజిక దర్పణం పట్టేలా చిత్రాలు వేస్తూ రాష్ట్ర, జాతీయ స్థాయిలో అనేక బహుమతులు గెలుచుకున్నది మిర్యాలగూడ పట్టణానికి చెందిన లిఖిత.
మిర్యాలగూడ పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన కమటం మధు, దీప్తి దంపతుల కుమార్తె లిఖిత ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్నది. ఆమెకు చిన్నతనం నుంచే చిత్రలేఖనంపై ఆసక్తి ఉండేది. అది గమనించిన తల్లిదండ్రులు పట్టణానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు ఇనుగుర్తి విజయ్‌కుమార్ వద్ద చిత్రలేఖనం తరగతులకు పంపించారు. అక్కడ రెండు సంవత్సరాలుగా ఆయిల్ పెయింట్, డ్రాయింగ్, పెన్సిల్ వర్క్స్, వాటర్ కలర్స్, క్యాన్వాస్ పెయింటింగ్ నేర్చుకుంటున్నది.
ఈ క్రమంలో వివిధ విద్యాసంస్థలు నిర్వహించే రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచి అనేక బహుమతులు, పతకాలను గెలుచుకున్నది. లిఖిత వేసిన దాదాపు వందకుపైగా చిత్రాలు సామాజిక దర్పణం పట్టేలా ఆకర్షణీయంగా ఉన్నాయి. వాటర్ కలర్స్‌తో వేసిన చిత్రాల్లో ప్లాస్టిక్ నిషేధం, పల్లె వాతావరణం, సేవ్ వాటర్, సేవ్ ఎర్త్, పర్యావరణం, ఆడ పిల్లలపై వేసిన చిత్రాలు ఆలోచింపజేస్తున్నాయి. కాగా, తాను వేసిన చిత్రాలతో భవిష్యత్‌లో మిర్యాలగూడలో ఒక ప్రదర్శన ఏర్పాటు చేయాలని ఉన్నదని లిఖిత తెలిపింది.