నీలగిరి, అక్టోబర్ 14: ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా నర్సింగ్ కళాశాలల్లో మంగళవారం డీఎంఈ అధికారులు ఏర్పాటు చేసిన స్పెషల్ టీమ్ సభ్యులు తనిఖీలు నిర్వహించారు. ఉస్మానియా, గాంధీ దవాఖానలకు చెందిన సిబ్బందిని ఏకకాలంగా నర్సింగ్ కళాశాలల్లో తనిఖీలు చేపట్టాలంటూ డైరెక్టర్ ఆప్ మెడికల్ హెల్త్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఉమ్మడి జిల్లాలోని జీఎంఎం, ఏఎన్ఎం కళాశాలల్లో ఇద్దరు నుంచి ముగ్గురు అధికారులు విచారణ చేపట్టారు. మీడియాకు, మెడికల్ అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా గుట్టు చప్పుడు కాకుండా తనిఖీలు చేపట్టారు.
నిబంధనలకు విరుద్ధంగా ఒకే భవనంలో మూడు నుంచి నాలుగు కళాశాలలు నిర్వహిస్తున్నారని, విద్యార్థులకు వసతులు సక్రమంగా లేవని, భవనాలు, అర్హత కలిగి అధ్యాపకుల వివరాలు తదితర అంశాలపై విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులు లేకున్నా ఉన్నట్లు రికార్డులు చూపి, ప్రభుత్వం నుంచి వస్తున్న ఉపకార వేతనాలు స్వాహా చేస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయని, వాటిని కూడా విచారించాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే విచారణకు వచ్చిన అధికారులు మాత్రం రహస్యంగా వచ్చి కాలేజీల్లో ఉన్న సౌకర్యాలు, వసతులపై విచారణ చేపట్టారు.
విషయం తెలిసిన మీడియా కాలేజీల వద్దకు వెళ్లి వివరణ కోరగా తమకు ఎలాంటి సంబంధం లేదని, సాధారణ విచారణ కోసమే వచ్చామని, వివరణ ఇచ్చేందుకు, ఫొటోలు తీసుకునేందుకు అనుమతి ఇవ్వలేదు. ముందుగా తమ కళాశాలల్లో ఎలాంటి విచారణ జరగడం లేదని, ఏ అధికారులు తమ కళాశాలలకు రాలేదంటూ గేటు బయటే యాజమాన్యాలు మీడియాను అడ్డుకున్నాయి. లోపలకు ఎలా వస్తారంటూ దురుసుగా ప్రవర్తిస్తూ సెక్యూరిటీ చేత బయటకు పంపించేశారు.