అత్యంత ఉత్కంఠ రేకెత్తిస్తున్న వరంగల్-ఖమ్మం-నల్లగొండ శాసన మండలి ఉపాధ్యాయ నియోజకవర్గం ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఇప్పుడు అందరి అంచనాలు గెలుపోటములపైకి మళ్లాయి. గురువారం నాటి పోలింగ్ సరళిని విశ్లేషిస్తూ ప్రధాన అభ్యర్థులంతా శుక్రవారం జిల్లాల వారీగా పరిస్థితిని సమీక్షించారు. ఆయా జిల్లా నాయకత్వాలను సంప్రదిస్తూ మండలాల వారీగా పోలింగ్ సరళిని తెలుసుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తాము చేసిన కృషి, చివరి వరకు ఓటర్లను ఆకర్షించేందుకు ప్రదర్శించిన శక్తియుక్తులు, చివర్లో ఓట్ల కోసం ప్రయోగించిన తాయిలాలు వగైరా అన్నీ కలిపి ఎంత వరకు సఫలమయ్యామన్న దానిపై ఆరా తీయడంలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో తమ వ్యూహాలు, ప్రయోగాలు, పోలింగ్ రోజున ఓటర్ల నాడిని బట్టి గెలుపుపై ఎవరి ధీమాలో వారు ఉన్నారు. ఇవ్వాల, రేపటి వరకు ఈ గెలుపోటముల చర్చోపచర్చలు సహజం. 3న కౌటింగ్ జరుగనున్నది. సోమవారం మధ్యాహ్నం వరకే ఫలితాల సరళి వెల్లడికానుంది. పోలింగ్ నాటి సరళిని పరిశీలిస్తే ప్రథమ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో విజేత తేలకపోవచ్చని, ద్వితీయ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తప్పనిసరి కానున్నట్లు తెలుస్తున్నది. ఇదే సమయంలో ప్రధాన అభ్యర్థులు గెలుపుపై ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఓట్ల లెక్కింపు ఎలిమినేషన్ రౌండ్స్ వరకు వస్తే గానీ విజేత తేలేకపోవచ్చన్న అంచనాలు లేకపోలేదు.
నువ్వా.. నేనా అన్నట్లు
టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ సారి టఫ్ ఫైట్ నెలకొన్నట్లుగా పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. 2013, 2019 టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ద్విముఖ పోరు కొనసాగగా ఈసారి అందుకు భిన్నంగా బహుముఖ పోటీ తెరపైకి వచ్చింది. ప్రధాన సంఘాల నుంచి ఎక్కువ మంది కీలక అభ్యర్థులు బరిలో ఉండడం, అందరూ చివరి వరకు శక్తివంచన లేకుండా గెలుపు కోసం ప్రయత్నించడంతో గెలుపోటములు అంచనాకు అందడం లేదన్న చర్చ వినిపిస్తున్నది. ఈ నేపథ్యంలో గురువారం నాటి పోలింగ్ సరళిపై కీలక సంఘాల నేతలు, అభ్యర్థులంతా శుక్రవారం రోజంతా సమీక్షలు చేస్తూనే ఉన్నారు.
ప్రధాన సంఘాల అభ్యర్థులు వారి నాయకత్వంతో క్షేత్రస్థాయి వరకు పరిస్థితులను అంచనా వేశారు. ఇక బీసీ సంఘాలతోపాటు ఇతర యూనియన్ల మద్దతుతో బరిలో నిలిచిన అభ్యర్థులు వారికి సంబంధించిన వారితో లెక్కల్లో మునిగి తేలుతున్నారు. మండలాల వారీగా ఉన్న ఓట్లెన్ని, పోలైనవి ఎన్ని, పోలైన వాటిల్లో మనకు ఎన్ని వచ్చి ఉంటాయంటూ ఆరా తీస్తూ బిజీబిజీగా గడిపారు. ఈ క్రమంలో సిట్టింగ్ ఎమ్మెల్సీ, యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి, పీఆర్టీయూ టీఎస్ అభ్యర్థి పింగిళి శ్రీపాల్‌రెడ్డి మధ్యే ప్రధాన పోటీ నెలకొని ఉంటుందన్న అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. వీరిద్దరూ తమ యూనియన్ల ద్వారా క్షేత్రస్థాయి వరకు వివరాలు సేకరించిన అనంతరం గెలుపుపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. యూనియన్ల పరంగా ఈ రెండింటికీ ప్రతి మండలంలో కార్యవర్గాలు ఉండడం, నిరంతరం ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం, పోలింగ్ రోజు వరకు అప్రమత్తంగా ఉండడం వంటి అంశాల నేపధ్యంలో వీరిరువురూ తమదే గెలుపంటే తమదేనన్న ధోరణి వ్యక్త పరుస్తున్నారు.
ఇక బీసీ సంఘాల మద్దతుతో టీచర్స్ జాక్ అభ్యర్థిగా రంగంలో నిలిచిన మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ సైతం గెలుపుపై ధీమాతో ఉన్నారు. బలమైన బీసీవాదంతోపాటు గతంలో పీఆర్టీయూలో కీలక నేతగా, ఎమ్మెల్సీగా పని చేసిన అనుభవం, నియోజకవర్గవ్యాప్తంగా ఓటర్లకు సుపరిచితం వంటి అంశాలు తన విజయానికి దోహదం చేస్తాయన్న అంచనా కనబరుస్తున్నారు. పీసీసీ అధికార ప్రతినిధి, పీఆర్టీయూ మాజీ నేత గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి కూడా విజయం తనదేనని భావిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వానికి దగ్గరగా ఉండి ఉపాధ్యాయ, అధ్యాపక సమస్యలు పరిష్కరించే సత్తా తనకే ఉందని ఓటర్ల విశ్వసించి ఓటేసినట్లు ఆయన పేర్కొంటున్నారు. ఇక బీజేపీ అభ్యర్థి పులి సర్వోత్తంరెడ్డి కూడా ప్రస్తుత పరిస్థితుల్లో బలమైన జాతీయ వాదం, బీజేపీ మద్దతు, మాజీ ఉపాధ్యాయ నేతగా అనుభవం తదితర అంశాలతో గెలుపుపై ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ నెల 3న జరుగనున్న కౌంటింగ్‌పై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది.
కీలకం కానున్న ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు
పోలింగ్ సరళిని బట్టి తొలి ప్రాధాన్యత ఓట్లతో ఫలితం తేలదన్నది స్పష్టం. ఈ నేపథ్యంలో ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు కీలకం కానున్నాయి. అభ్యర్థులు తమ ప్రచారంలో తొలి ప్రాధాన్యత ఓట్లపైనే ప్రధానంగా దృష్టి సారిస్తూనే అనుమానం ఉన్న చోట కనీసం రెండో ప్రాధాన్యత ఓటైనా వేయాలని అభ్యర్థించారు. కేవలం ఎన్నికల ప్రచార అంశాలు, అభ్యర్థుల గుణగణాల ఆధారంగా అయితే ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు పెద్దగా పోలయ్యేవో, కావోనన్న సందేహాలు ఉన్నాయి. కానీ గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రధాన అభ్యర్థుల్లో యూటీఎఫ్ మినహా మిగతా వారంతా ఓటర్లను డబ్బు, మద్యం, విందులతో ప్రలోభపెట్టే ప్రయత్నాలు చేశారన్న విమర్శలు వెల్లువెత్తాయి.
ప్రస్తుతం ఈ డబ్బు, మద్యం, విందు, వినోదాలే ద్వితీయ ప్రాధాన్యత ఓట్లల్లో కీలకంగా మారనున్నాయన్న చర్చ తీవ్రంగా జరుగుతున్నది. ఒక అభ్యర్థి నుంచి ఏదైనా కానుక స్వీకరించినప్పుడు మానవ నైజం ప్రకారం వారికి ఏదో ఒక ఓటు వేసే తత్వం సహజం. ఇప్పుడు ఇదే ద్వితీయ ప్రాధాన్యత ఓట్లల్లో కీలకంగా మారనుంది. ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్థుల నుంచి తాయిలాలు అందిన ఓటర్లు 1, 2, 3… ఇలా ప్రాధాన్యత ఓట్లు వేశారన్న చర్చ ఉంది. ఇలాంటి ఓట్లు ఎవరికి లాభిస్తాయి? ఎవరికి నష్టం చేస్తాయన్న చర్చ జోరుగా సాగుతున్నది. ప్రలోభాల పర్వం కూడా ప్రస్తుతం గెలుపోటములపై స్పష్టమైన అంచనాకు అడ్డుగా నిలుస్తున్నదని తెలుస్తున్నది. ఇది ఎక్కువగా ద్వితీయ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులోనూ ఫలితం తేలక ఎలిమినేషన్ రౌండ్స్‌కు కౌంటింగ్ దారి తీయవచ్చన్న అంచనాలూ లేకపోలేదు.
స్ట్రాంగ్ రూమ్స్ల్లో బ్యాలెట్ బాక్సులు
గురువారం సాయంత్రం 12 జిల్లాల పరిధిలో పోలింగ్ ముగిశాక బ్యాలెట్ బాక్సులను ముందుగా ఆయా జిల్లా కేంద్రాల్లోని రిసెప్షన్ కేంద్రాలకు తరలించారు. అక్కడికి అన్ని చేరాక భారీ బందోబస్తు నడుమ రూట్ల వారీగా శుక్రవారం తెల్లవారుజాము వరకు నల్లగొండలోని ఆర్జాలబావి స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాములకు తరలించారు. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూముల్లో జిల్లాల వారీగా బ్యాలెట్ బాక్స్‌లను భద్రపరిచారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠీ, ఎస్పీ శరత్ చంద్రపవార్ నేతృత్వంలో అభ్యర్థులు, వారి ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్స్‌కు సీల్ వేశారు. స్ట్రాంగ్ రూమ్స్ వద్ద మూడంచెల భద్రతా వ్యవస్థతోపాటు 24 గంటల పాటు సీసీ కెమెరాల పర్యవేక్షణలో స్థానిక పోలీసులతోపాటు అదనపు ఫోర్స్‌తో నిరంతర నిఘా పెట్టారు. ఈ నెల 3న ఉదయం 8గంటలకు కౌంటింగ్ మొదలుకానుంది. అంతకుముందే స్ట్రాంగ్ రూమ్స్‌ను ఓపెన్ చేసి బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ హాళ్లకు తరలిస్తారని కలెక్టర్ ఇలా త్రిపాఠీ తెలిపారు. కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తయినట్లేనని, హాల్స్‌ను సిద్ధం చేశామని, ఏ చిన్న ఆటంకమూ కలుగకుండా కౌంటింగ్ పూర్తి చేయడమే లక్ష్యమని ప్రకటించారు.
తుది పోలింగ్‌లో స్వల్ప పెరుగుదల
గురువారం సాయంత్రం 4 గంటల తర్వాత వెల్లడించిన పోలింగ్‌కు అర్ధరాత్రి తర్వాత పోలింగ్ కేంద్రాల వారీగా సేకరించిన తుది వివరాల ప్రకారం వెల్లడైన పోలింగ్ శాతంలో స్వల్ప పెరుగుదల కనిపించింది. నియోజకవర్గ వ్యాప్తంగా శుక్రవారం తెల్లారుజామున వెల్లడైన వివరాల ప్రకారం తుది పోలింగ్ 93.57శాతంగా నమోదైంది. గురువారం సాయంత్రం వివరాల ప్రకారం ఇది 93.55శాతంగా ఉన్న విషయం తెలిసిందే. నియోజకవర్గంలో మొత్తం 25,797 మంది ఓటర్లకు గానూ 24,139 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 12 జిల్లాల పరిధిలో నియోజకవర్గం విస్తరించి ఉండగా.. సిద్దిపేటలో 93.98శాతం, జనగామలో 94.31శాతం, హన్మకొండలో 91.66, వరంగల్‌లో 94.09, మహబూబాబాద్‌లో 94.47, భూపాలపల్లిలో 94.22, ములుగులో 92.83, భద్రాద్రికొత్తగూడెంలో 91.94, ఖమ్మంలో 93.05, యాదాద్రి భువనగిరిలో 96.54, సూర్యాపేటలో 94.97శాతం, నల్లగొండ జిల్లాలో 94.75 శాతం పోలింగ్ నమోదైంది. 2019 మార్చిలో జరిగిన ఎన్నికలతో పోలిస్తే ఈ సారి 3.16 శాతం పోలింగ్ పెరుగడం విశేషం. గత ఎన్నికల్లో తుది పోలింగ్ శాతం 90.41శాతంగా ఉంది. ఈ పెరిగిన పోలింగ్ శాతం ఎవరికి కలిసి వసతుందనే ఉత్కంఠత కూడా నెలకొంది.