శాలీగౌరారం : శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని శాలీగౌరారం మండలంలోని వివిధ గ్రామాల్లోగల ఆలయాల్లో సీతారాముల కల్యాణోత్సవాలను ఘనంగా నిర్వహించారు. అంబారిపేట గ్రామంలోని ప్రసిద్ధ ఆంజనేయ స్వామి ఆలయంలో గ్రామస్తులు రాములోరి కల్యాణాన్ని కన్నులపండువలా నిర్వహించారు. సీతారాములను పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో అలంకరించి కల్యాణం జరిపించారు.
వేద బ్రాహ్మణుల మంత్రోచ్చరణలు, బాజా బజంత్రీలతో సీతమ్మ, రామచంద్రస్వామి వార్ల కల్యాణం జరిగింది. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. రాములోరి కల్యాణాన్ని తిలకించి పులకించారు. కాగా గ్రామస్తులు ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. సంప్రదాయ వస్త్రధారణలో ఆలయానికి వచ్చి పూజలు చేశారు. సీతారాములతోపాటు ఆంజనేయస్వామి ఆశీస్సులు తీసుకున్నారు.