అర్వపల్లి, ఏప్రిల్ 28 : ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను అధికార పార్టీ నాయకులు తమ ఇష్టానుసారం ఇంట్లో కూర్చుని ఎంపిక చేస్తున్నట్లు సూర్యాపేట జిల్లా అర్వపల్లి సీపీఎం మండల కార్యదర్శి వజ్జె శ్రీనివాస్ తెలిపారు. అర్హులకే ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలంటూ డిమాండ్ చేస్తూ పార్టీ నాయకులతో కలిసి సోమవారం ఎంపీడీఓ గోపికి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల పరిధిలోని రామన్నగూడెంలో పేదలు, వితంతువులకు కాకుండా అధికార పార్టీ నాయకులు తమ అనుచరులకు, భూములున్నటువంటి వారిని ఎంపిక చేసినట్లు చెప్పారు. ప్రజా పాలన అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పటికైనా స్పందించి గ్రామ సభ నిర్వహించి రీ సర్వే చేసి అర్హులైన లబ్ధిదారులను గుర్తించి ఇందిరమ్మ ఇండ్లను ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి కృష్ణయ్య, వెంకన్న, సైదులు, సాయికుమార్ పాల్గొన్నారు.