నీలగిరి, జూలై 23 : తెలంగాణ రాష్ట్రంలో అప్పటి సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలలు నేటి రేవంత్రెడ్డి పాలనలో అస్తవ్యస్థంగా మారాయని స్వేరోస్ రాష్ట్ర కో కన్వీనర్ అనుముల సురేశ్ స్వేరో అన్నారు. బుధవారం స్థానిక రామగిరి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరలు సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సెక్రటరీగా ఉన్న సమయంలో గురుకులాల్లో నాణ్యమైన విద్యాబోధన ఇప్పించడంలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. దేశంలో కార్పొరేట్ విద్యా వ్యవస్థకంటే ఉన్నతంగా గురుకులాలను తీర్చిదిద్ది, గురుకుల విద్యార్థులను ప్రపంచ స్థాయి క్రీడాకారులుగా తయారు చేయడంతో పాటు ఎవరెస్ట్ శిఖరాన్ని సైతం ఎక్కించారన్నారు. విద్యా దేవాలయాలుగా విరాజిల్లిన గురుకులాలు నేటి రేవంత్ పాలనలో అస్తవ్యస్తంగా మారి ఆత్మహత్యలకు ఆడ్డాలుగా మారాయన్నారు.
ఫుడ్ పాయిజనై విద్యార్థులు మంచాల భారీన పడుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తుందని దుయ్యబట్టారు. ఈ సంఘటనలకు కారణమైన ఆధికారులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గురుకుల విద్యా వ్యవస్థపై సీఎం రేవంత్ రెడ్డి సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నారన్నారు. ఎస్సీ సామజిక వర్గానికి విద్యను దూరం చేయాలనే కుట్రలో భాగంగా అలుగు వర్షిణి రూపంలో గురుకులాలను చిన్నాభిన్నం చేస్తున్నారని విమర్శించారు. గురుకులాలను అధ్వాన్నంగా తయారు చేసిన సెక్రటరీ అలుగు వర్షిణీని వెంటనే తొలగించి, ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి గురుకులాల సమస్యలను పరిష్కరించకుంటే స్వేరోస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్వేరోస్ నాయకులు బొజ్జ పాండు. వెంకట్. వసంత్. రాఘవేంద్ర, కిరణ్, వినోద్ పాలొన్నారు.