సంస్థాన్ నారాయణపురం, నవంబర్25 : ఎంతో మందిని ఉన్నత విద్యావంతులుగా, ఉన్నతాధికారులుగా తీర్చిదిద్దిన దేశంలోనే మొట్ట మొదటి గురుకులం సర్వేల్. ఈ పాఠశాలలో ఇప్పటి వరకు 3,500 మంది విద్యార్థులు చదువు పూర్తి చేసుకుని బయటకు వెళ్లారు. వారిలో 40 మందికిపైగా ఐఏఎస్, ఐపీఎస్ ఆల్ ఇండియా సర్వీస్‌లో ఎంపికై దేశ వ్యాప్తంగా సేవలందిస్తున్నారు. 500 మంది వరకు అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, యూరప్ దేశాల్లో ఉన్నత స్థితిలో ఉన్నారు. ఇంజినీర్లు, డాక్టర్లు, రాజకీయంగా ఎదిగిన వారూ ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన వారు లెక్కకు మించి ఉన్నారు. 53 సంవ్సరాల క్రితం నిర్మించిన గురుకుల పాఠశాల తరగతి గదులు, భవనాలు శిథిలావస్థకు చేరుకోవడంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం విడుదల చేసిన రూ.20 కోట్లతో అన్ని హంగులతో నూతన భవనాలు నిర్మించారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ప్రత్యేక నిధులు రూ.కోటి మంజూరు చేసి అత్యాధునిక ఫర్నిచర్, డైనింగ్ టేబుళ్లు, బెడ్స్, పెయింటింగ్ పనులు పూర్తి చేశారు. ఈ నెల 27న నూతన గురుకుల పాఠశాల భవనాలను ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రారంభించడానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
దేశంలోనే మొట్ట మొదటి గురుకులం
సర్వేల్ గ్రామానికి చెందిన సర్వోదయ నాయకుడు మద్ది నారాయణరెడ్డి ఒకసారి విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ కోల్‌కతాలో ఏర్పాటు చేసిన శాంతినికేతన్‌ను సందర్శించారు. ఆ సమయంలోనే ఆయన సర్వేల్ గ్రామంలో గురుకులాన్ని స్థాపించాలని నిర్ణయించుకున్నారు. తన అలోచనలను ఆప్పటి సీఎం పీవీ నరసింహారావుతో పంచుకున్నారు. గ్రామంలో మద్ది నారాయణరెడ్డి నెలకొల్పిన సర్వోదయ ట్రస్టు స్థలాన్ని గురుకుల పాఠశాలకు కేటయించాలని నిర్ణయించుకున్నారు. గురుకుల పాఠశాల ఏర్పాటుకు 44 ఎకరాల భూమిని ఇచ్చేందుకు ముందుకు రావడంతో 1971 నవంబర్ 23న పీవీ నరసింహారావు స్వయంగా వెళ్లి గురుకుల పాఠశాలను ప్రారంభించారు. దేశంలోనే ఇది మొట్ట మొదటి గురుకుల విద్యాలయం కావడం గమనార్హం.
రూ.20 కోట్లతో నూతన భవనాలు నిర్మాణం..
సర్వేల్ గురుకులంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని ఆలుమ్ని అసోసియేషన్ సభ్యులు అప్పటి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దాంతో స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం గురుకులంలో నూతన భవనాలు నిర్మాణానికి రూ.20 కోట్లు మంజూరు చేసింది. గురుకులంలో అకాడమీ బిల్డింగ్, ఆడిటోరియం, వసతి గృహం, డైనింగ్ హాల్, గెస్ట్ హౌజ్, స్టాఫ్ క్వార్టర్స్, కంప్యూటర్ డిజిటల్ క్లాస్ రూమ్స్, లైబ్రరీ, నాన్ టీచింగ్ స్టాఫ్ బిల్డింగ్‌లను కార్పొరేట్ పాఠశాలలను తలదన్నేలా అన్ని హంగులతో నిర్మించారు. పాత భవనంలో అసంపూర్తిగా ఉన్న సౌకర్యాలతో ఇబ్బంది పడుతున్న విద్యార్థులకు ఇది ఎంతో ప్రయోజనకరంగా మారనుంది. కొత్త భవనాల ప్రారంభం కానుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.