నకిరేకల్, ఏప్రిల్ 28 : బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వెళ్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇసుక లారీలు అడ్డుపెట్టించి అడ్డుకున్నదని, కార్యకర్తలతో పాటు ఐదు కిలోమీటర్లు తనతోపాటు మరో ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు నడిచి సభా ప్రాంగణానికి చేరుకున్నామని, దాదాపు మూడు లక్షలకు పైగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను సభకు రానీయకుండా కుట్రలు చేసి అడ్డుకుందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అసహనం వ్యక్తం చేశారు.
నకిరేకల్‌లో ఆయన సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేసినందుకు నియోజకవర్గ ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. రజతోత్సవ సభకు లక్షలాదిగా ప్రజలు, కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలిరావడం, కేసీఆర్‌కు పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక కాంగ్రెస్ నాయకులు ఎదురు దాడికి పాల్పడడం సిగ్గుచేటన్నారు. రజతోత్సవ సభలో కేసీఆర్‌పై ప్రజలకు ఉన్న ఆదరణ చూసి తట్టుకోలేక మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు మీడియాలో విషం కక్కే ప్రయత్నం చేశారని మండిపడ్డారు.
పాలనలో తప్పులను సరిచేసుకోవాల్సింది పోయి సిగ్గులేకుండా కేసీఆర్‌పై ఎదురుదాడి చేస్తే ఏదో గొప్పోళ్లమవుతామని అనుకోవడం వారి అవివేకమన్నారు. కాంగ్రెస్ అంటేనే ఎదురు దాడులు చేయడం, ప్రజలను తప్పుదోవ పట్టించడం, ప్రతిపక్ష నాయకులు మాట్లాడకుండా గొంతునొక్కడమని ఆరోపించారు. 16 నెలలైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని, మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రామాల్లో తిరుగాలంటే భయపడే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా సభకు హాజరు కావాలని, కేసీఆర్‌ను చూడాలని, సందేశం వినాలని వచ్చి ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు సభను విజయవంతం చేశారని తెలిపారు.
ఈ సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల ప్రదీప్‌రెడ్డి, బీఆర్ఎస్ నకిరేకల్, కేతెపల్లి మండలాల అధ్యక్షులు ప్రగడపు నవీన్‌రావు, మారం వెంకట్‌రెడ్డి, కౌన్సిలర్ పల్లె విజయ్, మాజీ ఎంపీటీసీలు గుర్రం గణేశ్, రాచకొండ వెంకట్‌గౌడ్, నాయకులు పెండెం సదానందం, సామ శ్రీనివాస్‌రెడ్డి, రావిరాల మల్లయ్య, దైద పరమేశం, సత్యనారాయణ, అవిరెండ్ల జనార్దన్, చిట్యాల అశోక్ పాల్గొన్నారు.