మిర్యాలగూడ, డిసెంబర్ 10 : మిర్యాలగూడ నియోజకవర్గంలోని గ్రామీణ రోడ్లు బీటీగా మారనున్నాయి. అందుకు అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయగా పనులు ప్రారంభమయ్యాయి. వివిధ గ్రామాలను కలిపే లింకు రోడ్లను బీటీగా మార్చే విషయమై ఇటీవల ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ చొరవ తీసుకొని ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందించారు. ఈ రోడ్ల నిర్మాణం పూర్తయితే అన్ని గ్రామాల ప్రజలకు రవాణా మార్గం సులువవుతుంది.
రూ.29.21 కోట్లు మంజూరు
మిర్యాలగూడ నియోజవకర్గం పరిధిలో ఉన్న గ్రామీణ రోడ్లను బీటీగా మార్చేందుకు అవసరమైన రూ.29.21 కోట్లను ఎమ్మెల్యే భాస్కర్రావు చొరవతో ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో రూ.5.10 కోట్లతో పట్టణంలోని నందిపాడ్ బైపాస్ నుంచి ఐలాపురం వరకు, అద్దంకి-నార్కట్పల్లి హైవే నుంచి అన్నపురెడ్డిగూడెం వరకు 13 కిలోమీటర్లు, రూ.3.96 కోట్లతో పట్టణంలోని అద్దంకి హైవే రవీంద్రనగర్ కాలనీ నుంచి చిల్లాపురం వరకు 3 కిలోమీటర్లు, పట్టణంలోని తడకమళ్ల రోడ్డు నిర్మాణానికి రూ.5 కోట్లు, యాద్గార్పల్లి ఆర్ అండ్ బీ రోడ్డు నుంచి కేశవాపురం వరకు రూ.4.50 కోట్లు, కుక్కడం-పాములపాడ్ వరకు రూ.3.50 కోట్లు, బొత్తలపాలెం -రాగడప రోడ్డుకు రూ.3 కోట్లు, ముకుందాపురం-తుమ్మడం- అడవిదేవులపల్లి రోడ్డు నిర్మాణానికి రూ.2 కోట్లు, దామరచర్ల-జాన్పహాడ్రోడ్డుకు రూ.1.50 కోట్లు, మిర్యాలగూడ- దిలావర్పూర్- చింతపల్లి రోడ్డు నిర్మాణానికి రూ.5.15 కోట్లు మంజూరయ్యాయి.
రవాణా ఇక సులువు
నియోజకవర్గం పరిధిలోని పలు గ్రామాల నుంచి మిర్యాలగూడకు రోడ్డు సరిగా లేక పోవడంతో రైతులు రాకపోకలకు, తాము పండించిన ధాన్యం తరలించేందుకు అవస్థలు పడేవారు. ఎమ్మెల్యే భాస్కర్రావు కృషితో గ్రామీణ లింకు రోడ్ల నిర్మాణానికి రూ.29.21 కోట్లు మంజూరు చేయించారు. ఈ నిధులతో అన్ని గ్రామాల నుంచి మిర్యాలగూడ పట్టణానికి బీటీ రోడ్లు నిర్మించనున్నారు. రోడ్ల నిర్మాణం పూర్తి అయితే రవాణా సౌకర్యం ఏర్పడుతుంది. ప్రధానంగా రైతులకు ధాన్యం రవాణాకు మార్గం సులువవుతుంది. దాంతో పాటు ప్రజలు నిత్యం మిర్యాలగూడకు వచ్చి వెళ్లేందుకు వీలవతుంది. దాంతో నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయం
మిర్యాలగూడ నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు పోతున్నాం. మిర్యాలగూడ నుంచి ప్రతి గ్రామాన్ని అనుసంధానం చేస్తూ బీటీ రోడ్డు నిర్మించేందుకు ఇటీవల రూ.29.21 కోట్లు మంజూరు చేయించాను. ఇంకా రోడ్డు సౌకర్యం లేని గ్రామాలు ఉంటే గుర్తించి ప్రపోజల్స్ సిద్ధం చేయిస్తాం. రూ. 550 కోట్లతో దామరచర్ల, అడవిదేవులపల్లి మండలాల పరిధిలో 3 ఎత్తిపోతల పథకాలు మంజూరు చేయించాం. ఎప్పటికప్పుడు గ్రామాల ప్రజాప్రతినిధులు, ప్రజలతో మాట్లాడి మౌళిక వసతుల నిర్మాణాలకు నిధులు మంజూరు చేయిస్తాం.
– నల్లమోతు భాస్కర్రావు, ఎమ్మెల్యే మిర్యాలగూడ