నీలగిరి, మార్చి 24 : హెల్మెట్ లేని ప్రయాణం చాలా ప్రమాదకరమని ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని, లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ సీఐ మహాలక్షయ్య అన్నారు. నల్లగొండ పట్టణంలో నో హెల్మెట్– నో డ్రైవింగ్ పై మంగళవారం ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించి స్థానిక ఎన్జీ కళాశాల వద్ద వాహనదారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో, రద్దీ ప్రాంతాలలో వాహనదారులను తనిఖీ చేసి, హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడిపిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఐ పట్టుబడిన వాహనదారులకు హెల్మెట్ వినియోగంపైన అవగాహనా కల్పించారు. చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు దారితీస్తుందని, ప్రమాద సమయంలో తలకు గాయాలు కాకుండా రక్షణ కల్పించేది హెల్మెట్ మాత్రమే అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలు ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజలందరూ రోడ్డు భద్రత నియమాలను పాటిస్తూ, తమ ప్రాణాలను, ఇతరుల ప్రాణాలను కాపాడుకోవాలని పేర్కొన్నారు.