సూర్యాపేట అర్బన్, మార్చి 21 : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పదో తరగతి పరీక్ష కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లను ఎస్పీ నర్సింహ పరిశీలించారు. పదో తరగతి పరీక్షలు శుక్రవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. జిల్లా కేంద్రంలోని జడ్పీ బాలికల ప్రభుత్వ పాఠశాల, నంబర్-2, అంజిలి స్కూల్ పరీక్ష కేంద్రాలను ఎస్పీ పరిశీలించారు. పరీక్షలు నిర్వహిస్తున్న అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎక్కడా కూడా లోపాలు ఉండకుండా పర్యవేక్షణ చేయాలన్నారు.
అన్ని పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పరీక్షా సమయంలో విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ట్రాఫిక్‌ను సమర్థంగా నియంత్రించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. విద్యార్థులు పరీక్షలు బాగా రాయాలని, ఎవరూ అవకతవకలకు పాల్పడవద్దన్నారు. ఎస్పీ వెంట పట్టణ ఎస్ఐ ప్రవీణ్, బందోబస్తు సిబ్బంది ఉన్నారు.