నల్లగొండ, జూలై 19: పలు కారణాలతో 2024 ఫిబ్రవరి నుంచి డిసెంబర్ వరకు నల్లగొండ జిల్లాలో 123 మంది పంచాయతీ కార్యదర్శులు వేతనం లేని సెలవుపై వెళ్లారు. కనీసం అనుమతి లేకుండా.. సెలవు పెట్టకుండా విధులకు హాజరు కాలేదని నాటి కలెక్టర్ ఇలా త్రిపాఠి సీరియసయ్యారు. సెలవు పెడితే నాటి డీపీవో వెంకయ్య అనుమతి ఇవ్వలేదని పంచాయతీ కార్యదర్శులు.. ఇలా ఎవరి వాదన ఏదైనా ఆ 11 నెలల కాలాన్ని డైస్ నాన్(సర్వీస్ బ్రేక్) పేరుతో వారి సర్వీస్‌ను పరిగణనలోకి తీసుకోలేదు.
ఫలితంగా వారికి ఇప్పటి వరకు వచ్చిన రెండు ఇంక్రిమెంట్లు రాకపోగా ప్రొబేషనరీ పీరియడ్ పూర్తయినా కనీసం ఎస్బీ ఎంక్వైరీ జరగలేదు. దీంతో పాటు గ్రేడ్-4 నుంచి గ్రేడ్-3, 2, 1 కార్యదర్శుల స్థాయిలో రావాల్సిన ప్రమోషన్లకు ఇది అడ్డంకి కానుంది. ఈ డైస్ నాన్ పరిధిలోని కార్యదర్శుల కంటే జూనియర్స్‌కు త్వరగా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు రానుండగా.. వీరి పరిస్థితి మాత్రం ఆగమ్యగోచరంగా మారనుంది. మానవీయ కోణంలో ఆలోచించి డైస్ నాన్ నుంచి విముక్తి కల్పించి ఆ పీరియడ్‌ను సర్వీస్ బుక్‌లో ఎంటర్ చేసి తమను ఆదుకోవాలని కార్యదర్శులు కోరుతున్నారు.
ఈ పరిస్థితికి కారణం ఏంటి?
నల్లగొండ జిల్లాలోని 868 గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు విధులు నిర్వహిస్తున్నారు. వీరు 2024 ఫిబ్రవరి నుంచి డిసెంబర్ వరకు 123 మంది వేరే ఉద్యోగాల ప్రిపరేషన్, అనారోగ్యం తదితర కారణాలు చూపిస్తూ తమకు లాసఫ్పే మీద సెలవు ఇవ్వాలని ఎంపీవోలతో పాటు అప్పటి డీపీవో వెంకయ్యకు సెలవు పెట్టుకున్నారు. వారు సెలవు ఇవ్వకపోవడంతో గత్యంతరం లేక రిజిస్టర్ పోస్టులు చేశారు. ఒకేసారి ఇంత మంది సెలవు పెట్టడంతో అప్పటి కలెక్టర్ ఇలా త్రిపాఠి సీరియస్ అయి వారికి మొదటగా పోస్టింగ్స్ కూడా ఇవ్వలేదు.
పలు విన్నపాలు, వత్తిళ్ల నేపథ్యంలో షఫిలింగ్ చేస్తూ 2024 డిసెంబర్లో 24 మందికి, 2025 జనవరిలో 99 మందికి పోస్టింగ్స్ ఇచ్చినా ఆ 11 నెలల కాలాన్ని సర్వీస్ నుంచి బ్రేక్ చేశారు. దీంతో కార్యదర్శుల సర్వీస్‌లో ఆ 11నెలల కాలం లేకుండా పోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కార్యదర్శుల సర్వీస్‌ను బుక్‌లో ఎంటర్ చేయకపోవడంతో ఈ ఏడాది కాలంగా వచ్చిన రెండు ఇంక్రిమెంట్లు రాకపోగా.. ప్రొబెషనరీ పూర్తయిన కార్యదర్శులపై ఎస్బీ ఎంక్వైరీ కూడా జరగలేదు.
జిల్లాల్లో కామన్‌గానే జాయినింగ్
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే లక్ష ల్లో ఉద్యోగ నోటిఫికేషన్ వేస్తామని చెప్పడంతో ఉన్నత ఉద్యోగాల ప్రిపరేషన్ కోసం వెళ్లిన పంచాయతీ కార్యదర్శులు ప్రభుత్వం ఉద్యోగాల గురించే పట్టించుకోకపోవడంతో తిరిగి విధుల్లో చేరారు. అప్పుడు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఇదే పద్ధతిలో సెలవు పెట్టి వెళ్లారు. ఒక్క నల్లగొండ జిల్లాలో మినహాయిస్తే రాష్ట్రంలోని ఏ జిల్లాలో కూడా ఇలాంటి సర్వీస్ బ్రేక్ చేయకుండానే ఆయా జిల్లాల కలెక్టర్లు బదిలీలు చేస్తూ పోస్టింగ్స్ ఇచ్చారు.
సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో ఆరు నెలల్లోగా వచ్చిన వారికి అదే పోస్టింగ్ ఇవ్వగా.. అంతకు మించి పెట్టిన వారికి మాత్రం స్థాన చలనం చేశారు. నల్లగొండలోనే ఈ నిబంధన ఎందుకని.. ఇతర ఉద్యోగాలకు ప్రిపరేషన్ కోసం హక్కు లేదా.. సెలవు పెడితే ఎందుకు ఇవ్వలేదు.. పెడితే బదిలీ చేయండిగానీ, సర్వీస్ బ్రేక్ ఎందుకు అనే ప్రశ్నలు వారి నుంచి వచ్చాయి. ఈ నేపథ్యంలో బదిలీ మాత్రమే చేస్తున్నామని అప్పట్లో ప్రకటించిన కలెక్టర్ డైస్ నాన్ పేరుతో పనిష్ చేశారు. దీంతో రానున్న రోజుల్లో ప్రమోషన్లపైనా తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉన్నందున దీన్ని తొలగించి ఆ కాలాన్ని సెలవుగా పరిగణించి డైస్ నాన్ను ఎత్తేయాలని కార్యదర్శులు కోరుతున్నారు.
నాకు పూర్తిగా తెల్వదు
డైస్ నాన్ ఎంత మంది కార్యదర్శులపై ఉన్నదనే విషయంపై నాకు పూర్తి స్థ్దాయిలో సమాచారం లేదు. ఇటీవలనే ఒకరిద్దరు కార్యదర్శులు నాతో అన్నారు. ఎవరిపై ఉన్నదో వారు దరఖాస్తు చేసుకుంటే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తా. అప్పటి కలెక్టర్ ఏ విధమైన చర్య తీసుకున్నారో ఫైల్ చూస్తే తెలుస్తది.
-శంకర్ నాయక్, నల్లగొండ జిల్లా పంచాయతీ అధికారి
వివాదాలకు కేరాఫ్‌గా మారిన పంచాయతీ శాఖ
బీఆర్ఎస్ హయాంలో పంచాయతీ అధికారిగా ఉన్న విష్ణువర్దన్‌రెడ్డి ఆ శాఖను విజయవంతంగా నడిపినా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బదిలీపై వచ్చిన అధికారులు అధికార పార్టీ నేతల కనుసన్నల్లో పాలన చేయడంతో పంచాయతీ శాఖ వివాదాలకు కేరాఫ్‌గా మారింది. మురళి డీపీవోగా వచ్చిన తర్వాత గాడి తప్పిన ఆ శాఖ వెంకయ్య హయాంలో అస్తవ్యస్తంగా మారింది. కార్యదర్శులు అఫిషియల్‌గా సెలవుపెడితే ఇచ్చే పరిస్థితే లేదు.
ఓ నలుగురు సీనియర్ కార్యదర్శులు ఆ శాఖలో ఆస్థ్దాన కవుల్లాగా మారి డిప్యుటేషన్ల పేరుతో రూ.లక్షలు దండుకున్నారు. ఏడాది కాలంలోనే అప్పటి డీపీవో బదిలీ తర్వాత సుమారు 350 మందికి డిప్యుటేషన్లు ఇచ్చారంటే ఏస్థాయిలో నడిపించారో అర్థమవుతుంది. రోజుల తరబడి సెలువులు పెట్టి హాలియాలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించినా.. సెలవు పెట్టకుండా రోజుల తరబడి టూర్లకు వెళ్లినా పట్టించుకోని అధికారులు ఉన్నత ఉద్యోగాలు సాధించడానికి ప్రిపరేషన్ కోసం వెళ్లిన వారిపై మాత్రం డైస్ నాన్ పేరుతో పనిష్మెంట్ ఇచ్చారు.